- కర్ణాటక గెలుపులో జోడో యాత్ర ప్రభావం
- వ్యక్తిగత ఇమేజ్‌పెంచుకోవడంతోపాటు
- విజయదారులు పరిచిన రాహుల్ గాంధీ
- 7 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో నడక
- అత్యధికంగా మైసూర్‌లో 8 చోట్ల జయం
విధాత: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. వ్యక్తిగతంగా రాహుల్ ఇమేజ్‌ను పెంచడంతోపాటు పార్టీ విజయానికి బాటలు పరిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారిని నుంచి కశ్మీర్ వరకు (3700 కిలోమీటర్ల) భారత్ జోడో యాత్రను రాహుల్ చేపట్టారు. బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ అవలంబిస్తున్న విభజన, విద్వేష, మత రాజకీయాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే రెండు ప్రధాన లక్ష్యాలతో భారత్‌జోడో యాత్రను రాహుల్ తలకెత్తుకున్నారు.
కర్ణాటకలో అత్యధికంగా 21 రోజులపాటు యాత్ర
భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అత్యధికంగా 21 రోజులపాటు సాగింది. మొత్తం ఏడు జిల్లాల్లోని
51 నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర చేశారు. తొలుత చామరాజనగర్ జిల్లా నుంచి కర్ణాటకలోకి యాత్ర ప్రవేశించింది. తర్వాత మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. రాహుల్ అడుగుపెట్టిన 37 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 2018 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 18 సీట్లను మాత్రమే గెలుచుకున్నది.
సోనియమ్మ ఆశీర్వాదంతో
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉత్సాహంగా ఆమె కుమారుడు రాహుల్‌తోపాటు నడిచారు. ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో యాత్రలో పాల్గొన్నారు.
తల్లి సోనియా గాంధీ కాళ్లకు రాహుల్ షూ తొడిగి, లేసులు కడుతున్న ఫొటోలు అప్పట్లో అన్ని మీడియాల్లో ప్రముఖంగా వచ్చాయి. సుమారు 350 రోజులపాటు యాత్ర రాహుల్ యాత్ర సాగింది. కర్ణాటకలోనే పాదయాత్ర సాగుతుండగానే యాదృశ్చికంగా సోనియా గాంధీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ విజయం ఇలా..
ఈ 7 జిల్లాల్లో మొత్తం 51 నియోజకవర్గాలు ఉన్నాయి. చామరాజనగర్‌లోని 4 నియోజకవర్గాల్లో 3, మైసూర్‌లోని 11 నియోజకవర్గాల్లో 8, మాండ్యలోని 7 నియోజకవర్గాల్లో 5, తుమకూరులోని 11 సీట్లలో 6, చిత్రదుర్గలోని 6 నియోజకవర్గాల్లో 6, బళ్లారిలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయచూర్‌లోని ఏడింటిలో కాంగ్రెస్ 4 గెలుచుకున్నది. అత్యధికంగా మైసూర్‌లో 8 చోట్ల విజయం సాధించింది.