విధాత: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరంగా ఉంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో మాత్రం పాల్గొంటాను అంటూ ప్రకటించి, రేవంత్ వ్యతిరేకంగా మరోసారి తన వైఖరిని వెళ్లగక్కారు. ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు రావలసిన రేవంత్ రెడ్డి పాదయాత్రను జిల్లా కాంగ్రెస్ సీనియర్లయిన ఎంపీలు వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిలు వ్యతిరేకించడంతో కరీంనగర్ […]

విధాత: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు దూరంగా ఉంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో మాత్రం పాల్గొంటాను అంటూ ప్రకటించి, రేవంత్ వ్యతిరేకంగా మరోసారి తన వైఖరిని వెళ్లగక్కారు. ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు రావలసిన రేవంత్ రెడ్డి పాదయాత్రను జిల్లా కాంగ్రెస్ సీనియర్లయిన ఎంపీలు వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిలు వ్యతిరేకించడంతో కరీంనగర్ కు దారి మళ్లింది.

ఇప్పుడు ఈ నెల 16 నుండి భట్టి విక్రమార్క పాదయాత్ర మాత్రం నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల మీదుగా సాగుతుండగా జిల్లా సీనియర్లు అందులో పాల్గొంటామన్న తీరు ఆసక్తికరంగా మారింది.
ఆదివారం భట్టి స్వయంగా వెంకటరెడ్డిని కలిసి నల్గొండ జిల్లా మీదుగా సాగనున్న తన పాదయాత్రకు సహకరించాలని కోరగా ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ స్టార్ క్యాంపయినర్ గా, గతంలో వైయస్సార్ పాదయాత్ర పర్యవేక్షణ అనుభవం కలిగిన తాను భట్టి పాదయాత్ర నిర్వహణకు అవసరమైన సలహాలు ఇస్తానన్నారు. భట్టి పాదయాత్ర పూర్తిగా పాదయాత్రని గతంలో వైయస్సార్ పాదయాత్ర మాదిరిగా భట్టి పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మండుటెండల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా భట్టి పాదయాత్ర సిసలైన పాదయాత్ర అంటూ చెప్పిన వెంకట్ రెడ్డి మరోసారి రేవంత్ పాదయాత్ర సగం పాదయాత్ర.. సగం కారు యాత్ర అంటూ పరోక్షంగా మరోసారి గుర్తు చేయడం గమనార్హం. భట్టి పాదయాత్ర మంచిర్యాల, జడ్చర్ల నుంచి దేవరకొండ మీదుగా నల్గొండ జిల్లా కేంద్రానికి రానుందన్నారు.

గతంలో నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో భట్టి పాదయాత్ర సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అలాగే నకిరేకల్ లో మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టాలని భట్టినీ కోరడం జరిగిందన్నారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. నకిరేకల్ నుండి సూర్యాపేట, పాలేరు మీదుగా ఖమ్మం జిల్లాకు భట్టి పాదయాత్ర వెళుతుందన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు లేని రోజులలో భట్టి పాదయాత్రలో తాను హాజరవుతానన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని గౌరవిస్తాను అంటూనే రేవంత్ రెడ్డి తన పాదయాత్రకు నన్ను ఆహ్వానించ లేదని, అందుకే తాను వెళ్లలేదన్నారు. ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. భట్టి తన పాదయాత్రకు నన్ను ఆహ్వానించారని అందుకే భట్టి పాదయాత్రలో హాజరవుతానన్నారు.

భట్టి మాట్లాడుతూ సీఎల్పీ నేతగా తన పాదయాత్ర పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే నిర్దేశించిన మాదిరిగా, ఏఐసిసి ఆదేశాల మేరకు కొన్ని నియోజకవర్గాలలో కొనసాగుతుందన్నారు. రేవంత్ పాదయాత్రను, తన పాదయాత్రను జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకత్వమే నిర్ణయించిందన్నారు.

ఇద్దరికీ కొన్ని నియోజకవర్గాలను కేటాయించి పాదయాత్రలకు అనుమతించారన్నారు. అయితే ఒక్కో జిల్లా నుండి ఇంకో జిల్లాకు వెళ్లే క్రమంలో కొన్ని చోట్ల రేవంత్ పాదయాత్ర సాగిన గ్రామాల మీదుగా అనివార్యంగా వెళ్లాల్సి ఉందన్నారు. తాను రేవంత్ పాదయాత్రకు హాజరయ్యానని అదే రీతిలో ఆయన కూడా తన పాదయాత్రకు ఎక్కడో ఒకచోట హాజరవుతారన్నారు.

అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే సాగుతుందన్నారు. నల్గొండ జిల్లా మీదుగా వెళ్లే తన పాదయాత్రకు వెంకటరెడ్డి సహకారం కోరడం జరిగిందని, ఆయన అందుకు అంగీకరించారన్నారు.

Updated On 13 March 2023 12:59 AM GMT
krs

krs

Next Story