Congress Party | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతోంది. జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని నవాబ్‌పేట మండలం రుక్కంపల్లి గ్రామంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇక పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నమ్మిన వారంతా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి చేరేవారి జాబితా బయట పెట్టేందుకు సిద్ధంగా లేము. ఆయా పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని భట్టి పేర్కొన్నారు. బహుళ జాతి సంస్థల కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని ధ్వజమెత్తారు.
అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తారని వార్తలు వెలువడిన విషయం విదితమే. మొత్తానికి జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, పలు పార్టీల్లో చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.