ఆందోళనలో అక్రమార్కులు గులాబీ కార్పొరేట‌ర్‌ సహా ఐదుగురు అరెస్ట్ అధికార పార్టీ లీడర్ల పైన ఆరోపణలు కాంగ్రెసు కార్పొరేటర్ పై కేసు నమోదు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అడ్డు అదుపు లేకుండా పేట్రేగిపోతున్న ల్యాండ్ మాఫియా పై కొత్త పోలీస్ బాస్ గట్టి నిఘా పెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి కొద్ది కాలమే అయినప్పటికీ నూతన సీపీ ఏవి రంగనాథ్ పాలనాపరమైన విధానంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలనే రంగనాథ్ వరంగల్ సిపిగా […]

  • ఆందోళనలో అక్రమార్కులు
  • గులాబీ కార్పొరేట‌ర్‌ సహా ఐదుగురు అరెస్ట్
  • అధికార పార్టీ లీడర్ల పైన ఆరోపణలు
  • కాంగ్రెసు కార్పొరేటర్ పై కేసు నమోదు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అడ్డు అదుపు లేకుండా పేట్రేగిపోతున్న ల్యాండ్ మాఫియా పై కొత్త పోలీస్ బాస్ గట్టి నిఘా పెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి కొద్ది కాలమే అయినప్పటికీ నూతన సీపీ ఏవి రంగనాథ్ పాలనాపరమైన విధానంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలనే రంగనాథ్ వరంగల్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కొద్ది కాలంలోనే ముందుగా శాఖా పరమైన ప్రక్షాళన పై దృష్టి కేంద్రీకరించారు.

పోలీసు విభాగంలో అక్రమాలకు పాల్పడుతూ అనుచిత వైఖరిని అవలంబిస్తున్న ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు సహా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసి తన పద్ధతిని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ట్రాఫిక్ సమస్యపై దృష్టి కేంద్రీకరించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇక భూకబ్జాదారుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు.

భూకబ్జాదారులపై ఉక్కు పాదం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా భూకబ్జాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. సామాన్యుల భూమిపై కన్ను వేసిన కబ్జారాయుల్లు అధికార పార్టీ, ప్రజా ప్రతినిధుల సహకారం, కొంతమంది అవినీతి పోలీసు అధికారుల అండదండలతో, గూండా గ్యాంగులను వెంటేసుకొని విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని బెదిరిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో బాగానే జరిగాయి.

రాజకీయ అండదండ, ఆర్థికపరమైన వనరులు, పైగా రౌడీల సహకారంతో ఈ దందా ఇంతకాలం అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. తాజాగా పార్టీలకు అతీతంగా పోలీసు బాసు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భూ అక్రమణలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

కొద్ది రోజులుగా వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. దీంతో తమ భూములను స్థలాలను భూ అక్రమణదారుల నుండి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరిస్తారా రాజకీయ, అధికార ఒత్తిడికి తలొగ్గుతారా? కాలం నిర్ణయిస్తుంది. అయితే ఆరంభ శూరత్వంగా మిగులుతుందా? ఇదే పద్ధతి కొనసాగుతుందా? గత అనుభవాల నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూధరకు రెక్కలు కబ్జాదారులకు వరం

ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని నగర ప్రాంతాలు, శివారు ప్రాంతాలలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కబ్జారాయుళ్ల కన్ను ఈ ప్రాంతాలపై పడింది. కబ్జారాయుళ్లలో ఎక్కువమంది అధికార పార్టీ నాయకులుగానూ, ప్రజాప్రతినిధులుగానూ ఉన్నారు. లేకపోతే తమ బినామీలను రంగంలోకి దించి భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమ ఆదాయాలు సమకూర్చుకుంటున్నారు. దీంతో సామాన్యులు, బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతుంది.

సివిల్ కేసు కావడంతో తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమకు వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ భూకబ్జాదారులతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై చేస్తున్న ఈ అక్రమాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఒకరిని చూసి ఒకరన్నట్టు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సులభంగా వచ్చే ఆర్జనకు అలవాటుపడి ఈ ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా గ్రేటర్ పరిధిలో ఈ దందా సాఫీగా సాగిపోతుండగా బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.

చర్యలకు దిగిన సీపీ

ఈ నేపథ్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సిపి రంగనాథ్ ల్యాండ్ మాఫియా పై నిఘాపెట్టారు. తనకు అవసరమైన సమాచారాన్ని తెప్పించుకొని కొరడా ఝళిపిస్తున్నారు. ముందుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అందరూ భూకబ్జాదారులు వెనక్కి తగ్గకపోవడంతో తనదైన పద్ధతిలో పనిని ప్రారంభించారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ వేముల శ్రీనివాసు ఇటీవల ఒకరి భూకబ్జాకు యత్నించిన విషయం తన దృష్టికి రావడంతో తీవ్రంగా ప్రతిస్పందించారు.

హనుమకొండ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం ఆయనతో పాటు ఆయన డ్రైవర్‌ను కూడా తరలించారు. ఇదే సందర్భంగా వరంగల్ పరిధిలోని దేశాయిపేటలో భూకబ్జాకు ప్రయత్నించిన మరో ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.

భూకబ్జాదారులపై సిపి చేపడుతున్న ఈ చర్యలు సామాన్యులకు పోలీసుల పై కాసింత నమ్మకాన్ని పెంచుతుండగా అధికార పార్టీ అక్రమార్కుల్లో, అనుచరుల్లో ఆందోళన పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో కూడా సిపి ఈ విధంగానే వ్యవహరిస్తారా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది. అధికార పార్టీ నేతలు తెచ్చే ఒత్తిడికి లొంగిపోతారా? వేచిచూడాల్సిందే. ఇప్పటికైతే సిపి చర్యలను పలువురు ఆహ్వానిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కబ్జాదారుల అరెస్టు

ఇదిలా ఉండగా రాజకీయ పార్టీ నేతల మధ్య ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పైన తీవ్ర భూకబ్జాల ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు పరోక్షంగా ఈ భూకబ్జాలను ప్రోత్సహిస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ అక్రమార్జనకు అలవాటు పడ్డారనే విమర్శ పెద్ద ఎత్తున విన‌ప‌డుతోంది. ఈ పరిస్థితుల్లో సిపి అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా భూకబ్జాదారులపై ఉక్కు పాదం మోపడం గమనార్హం.

వేముల శ్రీనివాస్ హనుమకొండ ఎమ్మెల్యేకు అనుచరుడు కావడం చర్చకు దారి తీసింది. ప్రైవేటు ల్యాండు మీద‌కు వెళ్లి బాధితుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురి చేసిన ఘ‌ట‌న‌లో కార్పొరేట‌ర్‌, ఆయ‌న అనుచ‌రుల‌పై 506, 447, 427 సెక్షన్ల కింద హ‌న్మకొండ పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాజాగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరో సంఘటనలో దేశాయిపేటలోని సర్వేనంబర్ 90/బిలో భూమిని అక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన పొక్కులు చిరంజీవిరావు, గొడాసి అశ్విన్ కుమార్, సురోజు రమేష్ లను ఇంతేజార్‌గంజ్ను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు బొమ్మకంటి శ్రీనివాస్, మునుగంటి రమేష్ ప్రస్తుతం పరారీలో వున్నారు.

కాంగ్రెస్ కార్పొరేటర్‌పై కేసు నమోదు

మొన్న అధికార కార్పొరేటర్ పైన కేసు నమోదుచేసి అరెస్టు చేయగా నిన్న తాజాగా కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో పోలీస్ అధికారులు జక్కుల రవీందర్ పై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం నగరంలో రాజకీయ భూకబ్జాదారుల పై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలుగా కొనసాగుతూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్చ సాగుతోంది. మరికొందరు ప్రజా ప్రతినిధులు, అనుచరులు, కార్పొరేటర్లు, రాజకీయ పార్టీల లీడర్లు ఈ భూకబ్జాకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ముందుగా రూపొందించిన జాబితా ప్రకారం సిపి పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

గులాబీ నేతలపై తీవ్ర విమర్శలు

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అండగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ కార్పోరేటర్ పేరు కూడా రావడంతో విపక్షం నోరు మూత‌ప‌డింది. ఇది ఇలా ఉండగా ఈ భూకబ్జాల వెంట ఎక్కువ రాజకీయ పార్టీ నేతలే ఉండడం విమర్శలకు తావిస్తోంది.

పేదలు ఇంటి స్థలం కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే వారిపై అక్రమ కేసులు పెడుతూ గుడిసెలను పీకేస్తున్నారని, అదే పెద్దలు అధికార అండతో యథేచ్ఛ‌గా భూ కబ్జా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని వామపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. కబ్జాల వ్యవహారం చర్చనీయాంశంగా మారడం, పోలీసు అరెస్టుల‌ నేపథ్యంలో భూ దందా రాజకీయ రంగును సంతరించుకుంటున్నది.

Updated On 24 Jan 2023 10:43 AM GMT
krs

krs

Next Story