Bhumi Caravan |
విధాత: రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు తెలుసుకోవడానికి రెండో సారి భూమి కారవాన్‌ను చేపడుతున్నామని లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి వెల్లడించారు. గత నెల 10న ప్రారంభమైన ఈ యాత్ర సోమవారం రాయగిరి, ఆత్మకూరు, మోత్కురు, గుండాల, దెవురుప్పల, విన్నూరు, పాలకుర్తి మీదుగా ఘనపూర్ వరకూ సాగినట్లు తెలిపారు.
‘2014లో రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో భూమి హక్కులు, భూపరిపాలనకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు ఎలాంటివో తెలుసుకోవడానికి 2500 కి.మీ. పాదయాత్ర చేపట్టాం. తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా మరో సారి 2500 కి.మీ. పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇందులో భాగంగా రైతులను కలిసి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి, సాగుకు సంబంధించి రైతుల న్యాయ అవసరాలు ఏమిటి అనే అంశాలపై అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. దీని ఆధారంగా ప్రజల భూమి మేనిఫెస్టోని రూపొందించడమే కాకుండా రైతుల అవసరాలపై నివేదిక తయారు చేస్తామన్నారు.
ఈ యాత్రలో రైతులు ధరణి వల్ల కలుగుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రజల భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిగరి అన్నారు.
భూ హక్కుల చిక్కులు తీరాలంటే భూముల సర్వే జరిగాలని తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు కరుణాకర్ దేశాయ్ స్పష్టం చేశారు. భూమి సునీల్, రెవెన్యూ మాసపత్రిక సంపాదకులు లచ్చిరెడ్డి తదితరులు మాట్లాడారు. , న్యాయవాదులు జీవన్, మల్లేష్, సుదర్శన్, సందీప్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుంచి సురేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.