- రేవంత్ రెడ్డికి టచ్‌లో
- MLA వ్యూహాత్మక మౌనం
- అంతు చిక్కని భూపాల్ ఆంతర్యం
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాజకీయ వ్యూహాలు వచ్చే ఎన్నికల దిశగా ఏ మలుపు తీసుకుంటాయో అన్న ఆసక్తికర చర్చలకు బీజం వేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో భూపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్ రెడ్డికి టచ్‌లో వెళ్లారంటూ సాగిన ప్రచారం వైరల్‌గా మారి భూపాల్ రెడ్డి చుట్టూ రాజకీయ చర్చల రచ్చను రేపింది. అయితే ఈ ప్రచారాన్ని భూపాల్ రెడ్డి స్వయంగా ఖండించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న తీరు ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై మరింత చర్చకు ఆజ్యం పోసినట్లయ్యింది.
రేవంత్‌తో టచ్‌లోకి కంచర్ల..
బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎన్నికల్లో తన టికెట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంచర్ల తన పాత పార్టీ టీడీపీ మిత్రుడైన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో టచ్చ్‌లోకి వెళ్లారన్న సోషల్ మీడియా కథనాల ప్రచారం తాజాగా నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో హాట్ హాట్‌గా సాగిపోతున్నది. ఇందులో నిజా నిజాలు ఉన్నా.. లేకపోయినా ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా కంచర్ల పార్టీ మార్పు అంశంపై రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్ ప్రచారానికి తెరలేచినట్లయ్యింది.
పార్టీ మార్పు.. ఖండించని కంచర్ల..
కంచర్ల బ్రదర్స్ ఇద్దరూ తమ సొంత మండలం పరిధిలోని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేతో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారన్న చర్చ ఒకవైపు సాగుతుంది. ఇంకోవైపు టీడీపీ నుంచి వచ్చిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి రేవంత్‌ని కలిశారని ఇంకొందరు చర్చించుకుంటున్నారు. అయితే తన పార్టీ మార్పుపై రేగిన ప్రచారాన్ని కంచర్ల భూపాల్ రెడ్డి ఇంతవరకు బహిరంగంగా ఖండించక పోవడం మరింత చర్చకు ఆస్కారంగా మారిపోయింది.
నలువైపులా ప్రత్యర్థులు..
నల్గొండ నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి పార్టీ టికెట్ దక్కే విషయంలో సొంత పార్టీ నేతలు చకిలం అనిల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, పిల్లి రామరాజుల రూపంలో నలువైపులా ప్రత్యర్థులు పెరిగిపోయారు.
వారంతా తనను పట్టించుకోకుండా ఎవరికి వారు సొంత కార్యకలాపాలని నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండడం నియోజకవర్గంలో కంచర్లకు సంకటంగా మారింది. తరచూ మున్సిపాలిటీ కౌన్సిలర్ల నుంచి అసమ్మతి రాగాలు, పార్టీ శ్రేణుల్లో ఒక్కొక్కరు తన దుందుడుకు వైఖరితో దూరమవ్వడం వంటి పరిణామాలు కంచర్లను బీఆర్ఎస్‌లో ఒంటరిని చేస్తున్నాయి.
విషయం కేసీఆర్‌కు తెలిస్తే..
పార్టీలో తనకు పోటీగా కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై బీఆర్ఎస్ అధిష్టానం సైతం చర్యలు తీసుకోక పోవడం కంచర్లకు మరింత సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే కంచర్ల పక్క పార్టీ వైపు చూస్తూ ఉండవచ్చు అన్న వాదనకు ఆస్కారమిచ్చింది.
తాను బీఆర్ఎస్‌లో కొనసాగుతూనే వచ్చే ఎన్నికల దిశగా తనకు బీఆర్ఎస్‌లో నల్గొండ టికెట్ రాని పక్షంలో తనకు, లేదా తన సోదరుడు కృష్ణారెడ్డికి మునుగోడులో టికెట్ సాధించే విషయమై కంచర్ల ముందుచూపుతో రేవంత్ రెడ్డికి టచ్‌లో వెళ్లి ఉంటారని కంచర్ల వైరి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే భూపాల్ రెడ్డి రేవంత్ ఆదేశాల మేరకే టీఆర్‌ఎస్‌లో చేరినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన గుట్టుచప్పుడు కాకుండా రేవంత్‌ను కలిశాడన్న వార్తలు వారి మధ్య ఉన్న బందాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి.
అయితే కంచర్ల రేవంత్‌కు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం చెవిన బడితే మాత్రం ఇక బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వద్ద కంచర్ల స్థానం పలుచబడక తప్పదన్న వాదన సైతం వినిపిస్తుంది. ఏది ఏమైనా స్వయంగా కంచర్ల నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే గాని తన పార్టీ మార్పు ప్రచార కథనాలు ఆగని పరిస్థితి నెలకొనగా ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.