Ajmira Prahlad | టికెట్ విషయంలో భంగపాటు.. గులాబీపై తిరుగుబాటు కమలం నుంచి టికెట్ హామీ? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలను తెరపడింది. వాటిని నిజం చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు డాక్టర్ ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు […]

Ajmira Prahlad |
- టికెట్ విషయంలో భంగపాటు.. గులాబీపై తిరుగుబాటు
- కమలం నుంచి టికెట్ హామీ?
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలను తెరపడింది. వాటిని నిజం చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు డాక్టర్ ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు సమక్షంలో కమల తీర్ధం పుచ్చుకున్నారు. కొద్ది రోజులుగా ప్రహ్లాద్ ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పెద్దగా బుజ్జగింపులు, సంప్రదింపులు లేకపోవడంతో మంగళవారం ఆయన బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో బలమైన నాయకునిగా, తొలి నుంచి బీఆర్ఎస్ నాయకునిగా కొనసాగిన గుర్తింపు పొందిన ప్రహ్లాద్ పార్టీని వీడడంతో భారీ నష్టమే వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు కలిసివచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఒక దశలో చందూలాల్ తర్వాత ప్రహ్లాద్ ఆయన రాజకీయ వారసునిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా చర్చల్లో ఉన్న వ్యక్తి, పార్టీ అధిష్టానంపై నెలకొన్న అసంతృప్తితో బీఆర్ఎస్ కు దూరమయ్యారు.
గత నాలుగున్నరేళ్లుగా ఓపికతో ఎదురుచూసిన ప్రహ్లాద్, తన రాజకీయ గుర్తింపు కోసమే పార్టీని వీడారని తెలుస్తోంది. దీనికి ముందు ఆయన తన అభిమానులు, అనుచరులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పు దిశగా ఆయన ప్రయత్నించారు. బీజేపీ ములుగు టికెట్ హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రహ్లాద్ సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
నాగజ్యోతికి టికెటివ్వడంతోనే అసంతృప్తి
బీఆర్ఎస్ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీకి అభ్యర్థిగా జడ్పీ చైర్ పర్సన్, ఆదివాసీ బిడ్డ బడే నాగజ్యోతిని ఎంపిక చేసింది. ఈ నిర్ణయం టికెట్ ఆశించిన వారిని తీవ్రంగా భంగపరిచింది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క చేతిలో ఓటమి తర్వాత, టికెట్ ఆశిస్తున్న వారిలో ఆయన కుమారుడు, మాజీ మార్కెట్ చైర్మన్ అజ్మీరా డాక్టర్ ప్రహ్లాద్ తీవ్ర భంగపాటుకు గురయ్యారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్ సైతం ఉన్నారు. సీనియర్ నాయకులుగా ఉన్న వీరిద్దరినీ పక్కకుపెట్టి నాలుగేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాగజ్యోతికి అవకాశం లభించడంతో జీర్ణించుకోలేక పోయారు.
బీజేపీ వైపు మొగ్గు చూపిన ప్రహ్లాద్
పోరిక గోవిందనాయక్ ఒకింత మౌనం వహించగా, ప్రహ్లాద్ మాత్రం భవష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ప్రహ్లాద్ కు టికెట్ రాక పోవడం పట్ల అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే రెబల్ గా బరిలోకి దిగినా అండగా నిలుస్తామంటూ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను బీజేపీ నాయకులు సంప్రదించారు.
చందూలాల్ సన్నిహితుడు, మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత గరికపాటి రామ్మోహన్ రావు చొరవ తీసుకుని తనకున్న పరిచయాల మేరకు ప్రహ్లాద్ తో చర్చించినట్లు సమాచారం. ఈ కారణంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు.
ములుగు బీజేపీ అభ్యర్థిత్వం?
డాక్టర్ ప్రహ్లాద్ కు ములుగు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు చెబుతున్నారు. ఈ హామీ మేరకే ఆయన పార్టీలో చేరినట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. గట్టి హామీ తర్వాతనే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బీజేపీలో పోరిక పరశురామ్ నాయక్, తాటికృష్ణ మరికొందరు నాయకులు టికెట్ ఆశిస్తున్నప్పటికీ, ఆ పార్టీ మాత్రం ప్రహ్లాద్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
చందూలాల్ కుమారుడిగా, నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గాన్ని కలిగి ఉన్న నాయకునిగా, లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మంచి అవకాశం ఉంటుందని భావించి బీజేపీ వలవేసినట్లు చర్చసాగుతోంది.
కాంగ్రెస్ నుంచి సీతక్క, బీఆర్ఎస్ నుంచి నాగజ్యోతి ఇద్దరూ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ప్రహ్లాద్ లంబాడా సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రహ్లాద్ బీజేపీలో చేరికతో ములుగు నియోజకవర్గంలో గట్టిపోటీకి అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.
