HomelatestBJP | నమ్మకాలు అపనమ్మకాలు! బీజేపీలో విచిత్ర పరిస్థితి

BJP | నమ్మకాలు అపనమ్మకాలు! బీజేపీలో విచిత్ర పరిస్థితి

BJP |

  • ఇతర పార్టీల నుంచి వెళ్లిన వారిని పూర్తి స్థాయిలో నమ్మని వైనం
  • మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఇతరులకు పదవులెలా ఇస్తారంటున్న పాతకాపులు

విధాత: రాష్ట్ర బీజేపీలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నమ్మకాలు… అపనమ్మకాల మధ్య బీజేపీ నేతల రాజకీయ జీవితాలు కొనసాగుతున్నాయి. విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్, ఆరెస్సెస్ వంటి హిందూ భావజాలంతో ఉన్న సంస్థల నుంచి వచ్చి బీజేపీ నాయకులుగా ఎదిగిన వారికి, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య సైద్ధాంతికంగా అనేక తేడాలున్నాయి.

దీంతో మొదటి నుంచి హిందూ సంస్థల కార్యకర్తలుగా, నాయకులుగా ఉండి బీజేపీలో ఉన్నత పదవులు అలంకరించిన వారికి, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు మధ్య పొసగడం లేదన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది. దీనిని బలపరిచే విధంగా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు. ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నన్నాళ్లు కేసీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు కూడా.. జనబాహుళ్యంలో మంచి పట్టు ఉన్న నేత కూడా. ఈటల బీజేపీలో చేరిన తరువాత పార్టీకి ఒక ఊపు వచ్చింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ లాంటి నేతలు చాలా మంది బీజేపీలో చేరారు.

బీజేపీలో నాయకులు ఒక మాదిరిగా కనిపిస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరిగింది. రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ కూడా సాగింది. ఈ మేరకు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని ఈటల అనుచరులు అప్పట్లో చెప్పుకొన్నారు. ఏమైందో ఏమో కానీ ఈటలకు పార్టీ పగ్గాలు ఇవ్వలేదు. పైగా చేరికల కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌ను చేశారు.

ఏ అధికారాలు లేని ఈ కమిటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనుచరులు, ఇతర నాయకులు పెదవి విరిచారు. గట్టి పట్టున్న నేత ఈటలకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న చర్చ బయటి వర్గాలలో జరిగింది. దీని ప్రభావం వల్ల బీజేపీలో చేరికలు ఆగిపోయాయి.

మరో వైపు బీజేపీలో పాత నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం కావడంతో బీజేపీలోకి వలసలు ఆగిపోయాయని అంటున్నారు.

 

పాత నేతలు నమ్మడం లేదు..

పాత నేతలు కొత్త వారిని నమ్మడం లేదని, అలాంటప్పడు మనం వెళ్లినా ఏమి ప్రయోజనం ఉంటుందని ఒక నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో స్నేహ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని మరో నేత అన్నారు. దీనిని ధృవీకరించేలా శుక్రవారం ఢిల్లీలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ, గల్లిలో కుస్తీ అని ప్రజలు అనుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌తో స్నేహ సంబంధాలున్నప్పుడు తాము బీజేపీలోకి వెళ్లి ఏమి ప్రయోజనం? అని చాలా మంది నేతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పైగా ప్రజల్లో కూడా బీజేపీ గ్రాఫ్ పెరగలేదని, అలాంటప్పుడు నమ్మకం లేని దగ్గర ఉండడం కంటే… మరొకటి చూసుకోవడం బెటర్ అన్న అభిప్రాయం కొత్తగా బీజేపీలో చేరిన నేతల్లో వ్యక్తమవుతుందని అంటున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular