CPI | నిజాం వ్యతిరేక పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విధాత, హైద్రాబాద్ : భారతదేశంలో మతతత్వ , ఫాస్టిస్టు బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీఆరెస్ సహా దేశంలో బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు […]

CPI |
- నిజాం వ్యతిరేక పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
విధాత, హైద్రాబాద్ : భారతదేశంలో మతతత్వ , ఫాస్టిస్టు బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీఆరెస్ సహా దేశంలో బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాజా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో తెలంగాణ భాగమైందని, దానిని మనం ఉత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్, జన్ సంఘ్ పోరాటాలు, త్యాగాల పాత్ర ఏమిటో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పగలరా? అని రాజా డిమాండ్ చేశారు. తెలంగాణలో చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధాలు చెబుతున్నారని, భారత దేశ చరిత్రను పునర్లిఖించేందుకు మోడీ, షా, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు దీనిని నమ్మబోరని హెచ్చరించారు. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులే అగ్ర భాగాన నిలిచారని, అనన్యసామాన్య త్యాగాలు చేసి, రక్త తర్పణం చేసిన, ఏళ్ళ తరబడి జైలు శిక్షలు అనుభవించిన ఘన చరిత్ర కమ్యూనిస్టులకు మాత్రమే ఉన్నదన్నారు.
నిజాం వ్యతిరేక పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య పోరుగా బీజేపీ చరిత్రను వక్రీకకరిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ సహా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సహా లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ బీజేపీ, వాటి మిత్రపక్షాలను ఓడించాలనే ప్రాథమిక లక్ష్యంతో వాస్తవికతతో వ్యవహరించాలన్నారు. ఇందుకు పరస్పరం సర్దుబాటు చేసుకుంటూ, మరింత సన్నిహితంగా సమన్వయపరుచుకోవాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజంతో దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేయగలనని ఆయన అనుకుంటున్నాడని, కాని అది సాధ్యం కాదని, ఈసారి తెలంగాణ ప్రజలు మోసపోరని స్పష్టం చేశారు. జి- 20 సమావేశాల తరువాత మోడీ అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందారని, శక్తివంతుడయ్యారని బిజెపి గొప్పలు చెప్పుకుంటున్నదని,కానీ జి- 20 తరువాతే ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్ రూపాయి విలువ పతనమైందన్నారు. తాను మూడవ సారి అధికారంలోకి వచ్చి దేశాన్ని మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని మోడీ అంటున్నారని, ఇవాళ రూపాయి విలువ ఎంత, అంతర్జాతీయంగా నీ విలువ ఏమిటో చెప్పు అని నిలదీశారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వంటి మోడీ వాగ్దానాలన్నీ మోసాలనేనని అందరికీ అర్థమైందన్నారు. కేవలం అదానీ, అంబానీలే ప్రపంచంలో అత్యధిక ధనికులగా మారిపోయారన్నారు. మణిపూర్ జాతుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని, అయినా మోడీ మాట్లాడడని అన్నారు. మోడీ పాలనలో రాజ్యాంగం, ఫెడరలిజం, లౌకికవాద పునాధులను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. అన్నారు. గవర్నర్ కేంద్రంలోని బిజెపి ఏజెంట్ పని చేస్తున్నారని, మరి దీనిపై కేసీఆర్ ఎలా నిలదీస్తున్నాడో తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు.
ఇండియా కూటమి లాంఛనంగా ప్రకటించిన వెంటనే మోడీకి కలవరం మొదలైందని, కూటమిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇండియా కేవలం పార్టీల కూటమి కాదని, మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న, తొమ్మిదేళ్ళుగా కష్టాలు పడుతున్న ప్రజల కోసం ఏర్పడిన కూటమి అని చెప్పారు. బిజెపిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ‘ బీజేపీ హఠావో, దేశ్ బచావో’ నినాదంతో మందుకు సాగుతున్నామన్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక అని మోడీ అంటున్నారని, రాజ్యాంగం ఏర్పాటు సమయంలో నే అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారని, భారతదేశం బహుళత్వం కలిగిన సమాజమని, ఒక్కడ బహుళ పార్టీ విధానం, స్వేచ్ఛాయుత ఎన్నికలు అవససరమని, అందుకే రాజ్యాంగబద్ధమైన శాశ్వత ఎన్నికల కమిషన్ అవసరమని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని ఒకే దేశం ఒకే ఎన్నికలు అని మోడీ అంటున్నారని, ఇటీవల వచ్చిన కాగ్ రిపోర్టులో జాతీయ రహదారుల నిర్మాణంలో రూ.7.5 లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు చెప్పిందని, దాని సంగతి చూడాలని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు అగ్ర నేత ఇంద్రజిత్ గుప్తా కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వమే అన్ని పార్టీల ఖర్చు భరించే ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని రాజా డిమాండ్ చేశారు.
కేసీఆర్ కు ఎంఐఎం భయం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విముక్తి వారోత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఎందుకు విలీన వారోత్సవాలు జరపలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఎంఐఎంతో భయపడి కేసీఆర్ తెలంగాణ విముక్తి వేడుకలు జరపడం లేదన్నారు. ఎంఐఎం చూస్తే కేసీఆర్ కు ప్యాంటు తడుస్తుందని, అంగట్లో అమ్ముడు పోయే సరుకు ఎంఐఎం అని విమర్శించారు.
కాసీం రజ్వీ, జిన్నాలకు పుట్టిన విషపు పిందె ఎంఐఎం అని దుయ్యబట్టారు. మోడీతో కేసీఆర్ రాజీ పడినందునే కూతురు కవిత లిక్కర్ కేసు విచారణ ఆగిపోయిందన్నారు. విభజన చట్టంలోని అంశాలు మోడీ నెరవేర్చకపోయినా, వైసీపీ, బీఆరెస్, ఎంఐఎంలు మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వేల కోట్లు మింగినోడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారా అని, లిక్కర్ క్వీన్ జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ రిటైల్ హోల్ సేల్ అవినీతి చేస్తే, మోడీ దత్తపుత్రులతో కలసి దేశ సంపదను హోల్ సేల్ గా కొల్లగొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చిల్లర చిలక కొట్టుడులాంటిదని తప్ప బీజేపీ పార్టీలా కాదన్నారు. మోడీ ప్రజా సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. సనాతనం గురించి మోడీకి ఏం తెలుసని, భర్త చనిపోతే భార్యను చితిమంటలపై కాల్చాలని మోడీ చెబుతారా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం ఔట్ డేటెడ్ అని ఆనాడే కృష్ణుడే ఒప్పుకున్నారని, మీరు ఒప్పుకోరా అని నిలదీశారు.
పేగు బంధం తెలియని హీనులే మతం సనాతనం గురించి మాట్లాడుతారని అన్నారు. మోడీకి కావాల్సిన బిల్లులను ఆమోదం చేసుకునేందుకే గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 33 తూములుంటే, ఒక్క తూము తెరిచారని, ఇక్కడి నుంచి అక్కడికి పోయి కేసీఆర్ మూత్రం పోసి వచ్చినట్లు నీళ్లు వస్తున్నాయ్ అన్నారు. ప్రజలను మభ్య పెట్టడంలో మోడీకి అమ్మమొగుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు.
తెలంగాణ విముక్తి వేడుకలపై మాట తప్పిన కేసీఆర్: సీపీఐ కార్యదర్శి కూనంనేని ధ్వజం
తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి వస్తే తెలంగాణ విముక్తి వేడుకలను అధికారికంగా నిర్శహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట తప్పాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం సెప్టెంబర్ 17తెలంగాణ విముక్తి దినోత్సవం, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడి తెలంగాణ విముక్తి వేడుకలు జరుపడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందన్నారు. భారత యూనియన్‌లో విలీనం పిదప ఏడాది పాటు కొనసాగిన సాయుధ పోరులో ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. పోరాటాలు చేసింది కమ్యూనిస్టులైతే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ప్రజా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించిన సీఎం కేసీఆర్ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు సభాధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి , పశ్యపద్మ, వి.ఎస్.బోస్, ఎన్.బాల మల్లేశ్, కలవేని శంకర్, భాగం హేమంతరావు, ఎం.నర్సింహ , ఈటి.నర్సింహ హాజరయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి, కవి,రచయిత,గాయకుడు జయరాజ్,తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు మొయినుద్దీన్ శాలువాతో సన్మానించారు. సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సీతరామయ్య ,ఎన్.జ్యోతి, ఎ.రవీంద్రచారి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి చాయాదేవి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.జి సాయిలుగౌడ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్యతో పాటు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు.
