- టీఆర్ఎస్ కౌన్సిలర్లపై మరింత పెరగనున్న ఒత్తిడి
విధాత, నిజామాబాద్: కామారెడ్డి మున్సిపల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. దీంతో టిఆర్ఎస్ కౌన్సిలర్లపై మరింత ఒత్తిడి పెరగనుంది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళన పట్ల టీఆర్ఎస్ ప్రభత్వం నిర్లిప్తంగా ఉండడంతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది.
ఇందులో భాగంగానే గురువారం వరకు విలీన గ్రామాల కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయాలని గడువు విధించాయి. దీంతో ఆయా గ్రామాల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2వ వార్డు, 11వ కౌన్సిలర్లు మధ్యాహ్నం 2గంటలకు తమ రాజీనామాలను ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులతో కలిసి మున్సిపల్ కమీషనర్ దేవేందర్‌కు అందజేశారు.
అంతే కాకుండా వారికి మద్దతుగా మిగతా బీజేపీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.