Telangana | బీజేపీలో మారుతున్న సమీకరణలు భారీ చేరికల ఊసే లేదు.. నియోజకవర్గ బాధ్యులకు టికెట్ కట్ తొలి జాబితాలో ఏకాభిప్రాయ స్థానాలే ప్రకటిస్తారా? జమిలి ఎన్నికల కమిటీ కంటితుడుపు చర్యే.. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కాంగ్రెసేతర ప్రభుత్వాలతో అంతర్గత అవగాహన విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. కేంద్ర అధిష్టానం అంతా తానై నడిపిస్తోంది. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్గత […]

Telangana |
- బీజేపీలో మారుతున్న సమీకరణలు
- భారీ చేరికల ఊసే లేదు..
- నియోజకవర్గ బాధ్యులకు టికెట్ కట్
- తొలి జాబితాలో ఏకాభిప్రాయ స్థానాలే ప్రకటిస్తారా?
- జమిలి ఎన్నికల కమిటీ కంటితుడుపు చర్యే..
- కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పావులు
- కాంగ్రెసేతర ప్రభుత్వాలతో అంతర్గత అవగాహన
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. కేంద్ర అధిష్టానం అంతా తానై నడిపిస్తోంది. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్గత అవగాహనతో అసెంబ్లీల ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమౌతున్నది. దానికి అనుగుణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అధికారంలోకి వస్తామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి అని బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతిమయమంటూ ప్రచారమూ చేసింది. ఐతే బీజేపీ అభ్యర్థులను ఇప్పటివరకూ ప్రకటించలేదు. మరోవైపు బీజేపీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయని చాలా కాలంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. ఆ పరిస్థితులేమీ కనిపించడం లేదు. పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నది.
అయితే ఆపార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవాళ్లు టికెట్ ఆశించవద్దని చాలాకాలం కిందటే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చెప్పారు. దీంతో గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడినవాళ్లు, పార్టీల్లో తమకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తులు బీజేపీ టికెట్ ఆశించి పార్టీలో చేరారు. వాళ్ల ఆశలపై బన్సల్ నీళ్లు చల్లారు. దీంతో ఆ పార్టీ పోటీచేయడానికి ఇతర పార్టీల నుంచి ఎంత మంది ఉన్నారన్నది స్పష్టత లేదు.
ఇతర పార్టీల అసంతృప్తులకు గాలం?
నియోజకవర్గంలో ఏకాభిప్రాయం ఉండి, ఒక్కరే పోటీపడే స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. అలాంటి దాదాపు 25 వరకు ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. అభ్యర్థులను మార్చకుండా వాళ్లే ఉండే ఈ 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ 115 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.
అయితే ఆ ప్రకటనకు అనుగుణంగా అందరికీ బీ ఫామ్‌లు దక్కుతాయా? చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతున్నది. అయితే కొన్ని మార్పులు ఉండొచ్చని అధికారపార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 15వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ 50-60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, అధికారం మాదే అంటున్న బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ సాయంత్రం వరకు ముగియనున్నది. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వర్గీకరించి వారిలోంచే ఒకరికి అవకాశం ఇస్తుందా? లేక ముందు 25 స్థానాలకు ప్రకటించి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్తులకు టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నదా? అనే చర్చ కూడా జరుగుతున్నది.
జమిలి ఎన్నికలు సాధ్యమేనా?
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల కోసం కేంద్రం కమిటీ వేసింది. అయితే అది అంత సులువు కాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల ఖర్చు కూడా తక్కువ అవుతుందనే కేంద్ర వాదన అర్థరహితమని కొట్టివేస్తున్నారు. గతంలో జమిలి ఎన్నికలపై లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్రం, తాజాగా వేసిన కమిటీ కంటితుడుపు చర్యే అంటున్నారు.
కాబట్టి బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో అధికారం కంటే కేంద్రంలో అధికారమే ముఖ్యమనే కోణం ఆలోచిస్తున్నట్టు తాజాగా పరిణామాణాలను చూస్తే అర్థమౌతుంది. కాంగ్రెస్ ను నిలువరించేందుకు ఎత్తులు వేస్తోంది. తెలంగాణలోనూ బీఆర్ఎస్ తో అంతర్గత అవగాహనతో అసెంబ్లీల ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
మొదటి జాబితాలో ఉండేది వీళ్లేనా?
బీజేపీ త్వరలో ప్రకటించనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో సుమారు 25 మంది వరకూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నట్లు తెలిసింది.
అందులో ప్రధానంగా ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, బండి సంజయ్, జీ కిషన్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, ఏపీ జితేందర్‌రెడ్డి, గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు నర్సింహారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, డీకే అరుణ, ఆచారి, తుల ఉమ, బొడిగె శోభ, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రాకేశ్‌రెడ్డి తదితరులు ఉండనున్నట్లు సమాచారం.
వీళ్లు ఎంపీ లేదా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా?
ఈ 25 మంది జాబితాలో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, వివేక్, జితేందర్‌రెడ్డి తిరిగి ఎంపీగా పోటీ చేస్తారా? లేక ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా? అన్నది వేచి చూడాలి.
