BJP తాజాగా జేడీయూతో కుదిరిన పొత్తు విధాత: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు 'ఇండియా' కూటమిలోకి కొత్త పార్టీలు చేరుతుండటం, ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించి దానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ ఉంటే ఎలా ముందుకు వెళ్లాలన్న సమాలోచనలు చేస్తున్నది. బీజేపీ కూడా ఎన్డీఏ, ఇండియా కూటమికి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నది. ముందుగా కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ […]

BJP

తాజాగా జేడీయూతో కుదిరిన పొత్తు

విధాత: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు 'ఇండియా' కూటమిలోకి కొత్త పార్టీలు చేరుతుండటం, ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించి దానికి అనుగుణంగా రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ ఉంటే ఎలా ముందుకు వెళ్లాలన్న సమాలోచనలు చేస్తున్నది. బీజేపీ కూడా ఎన్డీఏ, ఇండియా కూటమికి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకొనే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నది.

ముందుగా కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను తనవైపు తిప్పుకునే వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే కర్ణాటకలో జేడీఎస్‌ను ఎన్డీయే కూటమిలోకి చేర్చుకున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి.

ఈ మేరకు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు 4 సీట్లు ఇవ్వడానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అంగీకరించారని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తెలిపారు. జేడీఎస్‌కు పాత మైసూర్‌, బెంగళూరు ప్రాంతాల్లో గట్టి పట్టున్నది.

అలాగే గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాల్లో ఏకంగా 25 సీట్లు కైవసం చేసుకున్నది. మిగిలిన మూడు స్థానాల్లో ఎన్డీఏ మద్దతుతో నటి సుమలత విజయం సాధించగా, కాంగ్రెస్‌ పార్టీ, జేడీఎస్‌ చెరొకటి గెలుచుకున్నాయి. జేడీఎస్‌ను కలుపుకొని వెళ్తే గతంలో వలే 20కి పైగా సీట్లు దక్కించుకోవాలన్నది కాషాయ నేతల వ్యూహంగా కనిపిస్తున్నది.

కేసీఆర్‌కు షాక్‌

ప్రాంతీయ పార్టీల్లో జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ, డీఎంకే, జేఎంఎం, ఆర్‌ఎల్‌డీ, వామపక్షాలతో పాటు ఇటీవల జాతీయ పార్టీ హోదా పొందిన ఆప్‌ కూడా ఇండియా కూటమితోనే కలిసి నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కాంగ్రెస్‌, బీజేపీ యేతర కూటములకు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేయాలన్న కేసీఆర్‌కు ఇటు రాష్ట్రంలోనూ.. అటు దేశంలో షాక్‌లు తగులుతున్నాయి.

వామపక్షాలు ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపుల్లో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని చెబుతున్నారు. మొదటి నుంచీ తనకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌.. బీజేపీతో జత కట్టడం కేసీఆర్‌కు మింగుడు పడని అంశమే.

ఎందుకంటే టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎస్‌గా ప్రకటించిన సమయంలో కేసీఆర్‌కు మద్దతు తెలుపడానికి ఆయన గతంలో భేటీ అయిన ప్రాంతీయ పార్టీల నేతలెవరూ రాలేదు. జేడీఎస్‌ నుంచి ఒక్క కుమారస్వామి మాత్రమే ఆ రోజు హాజరయ్యారు.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ అక్కడి ఓటర్లు బీజేపీతోపాటు, జేడీఎస్‌ కూడా షాక్‌ తగిలించారు. నాటి నుంచి పార్టీ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. నాటి నుంచే జేడీఎస్‌ కాషాయ పార్టీతో కలిసి వెళ్తుందనే ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది.

ప్రాంతీయ పార్టీలే దిక్కు!

ఇండియా కూటమి బలపడుతుండటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో వలె పూర్తి మెజారిటీ రాకపోవచ్చనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తే తప్ప.. ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కుదిరిన చోట్ల సీట్లు సర్దుబాటు చేసుకోవడం, లేని చోట్ల పార్టీల్లో చీలిక తేవడం వంటివి అమలు చేస్తున్నది.

ఈ కోవలోనే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలో చీలిక తెచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీలతో కలిసి బీజేపీ సర్దుబాటు చేసుకోనున్నది. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా బీజేపీ పట్ల సానుకూలంగానే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నా.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా విమర్శిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఏమిటన్నది స్పష్టమవనున్నది. ఇక తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిని ఎదుర్కొనడం కష్టమని కమలనాథులకు అర్థమైందని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ అన్నాడీఎంకే ఉన్నప్పటికీ ఆ పార్టీలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య నెలకొన్న వర్గపోరుతో ఆ పార్టీ బలహీన పడింది.

దీంతో అక్కడ అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అందుకే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశంపై ఎన్నికల్లో పోటీకి సిద్ధమా? అని సవాల్‌ విసురుతున్నారు. అక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తున్నారు.

Updated On 9 Sep 2023 7:58 AM GMT
krs

krs

Next Story