- స్పష్టత ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్
- ఇక దూసుకుపోనున్న రాష్ట్ర ముఖ్య నేతలు
- ఓవర్ లోడ్ తో ఉన్న బీఆర్ ఎస్ నుంచే పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం
విధాత: బీజేపీలో మున్ముందు చేరికలు ఊపందుకోనున్నట్లు తెలుస్తున్నది. బుధవారం రాత్రి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. గెలుస్తారన్న విశ్వాసమున్న వారికి సీటుపై ముందే హామీ ఇవ్వటం ద్వారా చేరికలను వేగవంతం చేయాలని తరుణ్ ఛుగ్ సూచించారట.
చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ రష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరైన ఈ సమావేశంలో చేరికలు, ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ నుంచి చాలా మంది బీజేపీలో చేరటానికి సంసిద్ధంగా ఉన్నా.. వారికి సంబంధించి సీటు విషయంలో హామీ లేకుండా చేరటం కుదరదని అంటున్నారట. ఇదే విషయాన్ని తరుణ్ ఛుగ్తో బీజేపీ నేతలు చర్చించి తగు హామీ తీసుకున్నారట. చేరుతున్న వారు ఆయా నియోజక వర్గాల్లో గెలుస్తారనే విశ్వాసం రాష్ట్ర పార్టీకి ఉన్నప్పుడు సీటుపై హామీ ఇవ్వటంలో అభ్యంతరం ఎందుకని తరుణ్ ఛుగ్ ప్రశ్నించినట్లు అంటున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలో ముమ్మరంగా చేరికలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయని బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నది. ఎందుకంటే.. ఇప్పటికే ప్రతి నియోజక వర్గంలో బీఆర్ ఎస్ ఓవర్ లోడై ఉన్నది. ఒక్కో సీటును ఆశిస్తున్నవారుగా ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు, ముగ్గురికి మించి ఉన్నారు. వారిలో సీటు రానివారు తప్పక పార్టీ మారక తప్పని పరిస్థితి ఉంటుందని, దాన్ని బీజేపీ వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.