HomelatestBJP | ఇంకా మత పిచ్చి వదలని బీజేపీ.. కర్ణాటక దెబ్బతోనూ బుద్ధి రాదా?

BJP | ఇంకా మత పిచ్చి వదలని బీజేపీ.. కర్ణాటక దెబ్బతోనూ బుద్ధి రాదా?

BJP | Karnataka

  • ఏక్తా యాత్రలో ఊగిపోయిన కాషాయ నేతాగణం
  • రామరాజ్యం కాదు.. రాజ్యాంగ పాలన కోరుతున్న ప్రజలు

విధాత: అధికారంలో ఉన్న పార్టీలు తాము చేసిన అభివృద్ధి గురించి, మళ్లీ అవకాశం ఇస్తే ఏం చేస్తామనే దానిపై ఓట్లు అడుగుతారు. కానీ ఎన్నికలు రాగానే బీజేపీ (BJP) నాయకులు రామరాజ్యం, మతం, పాకిస్థాన్‌, రజాకార్ల పాలనా అనే నినాదాలతోనే ఓట్లు అడగటం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు చైతన్యవంతులు. ఈ ఉద్వేగాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయవని కర్ణాటక ఫలితాలతోనే తేటతెల్లమైంది.

గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతి ఉన్న తెలంగాణ ప్రాంతం ఇంకా చైతన్యవంతమైన నేల. రాచరిక పాలకులకు, ఒక ప్రాంతంపై వివక్ష చూపిన పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన నేల ఇది. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వారి ఆశలు నెరవేరవు.

తెలంగాణలో రామరాజ్యం తెస్తామంటున్న బిశ్వశర్మ లాంటి వాళ్లు తాము అధికారంలో ఉన్న మణిపూర్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణిస్తుంటే ప్రధాని, హిమంత లాంటి వాళ్లు కర్ణాటకలో ప్రచారం చేశారు. వీళ్ల విద్వేష రాజకీయాల వల్ల ఏం జరుగుతుందో ఏడాది కాలానికి పైగా చూశారు కాబట్టే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టారు. ప్రజాతీర్పును కాలరాస్తున్న కమలనాథులకు మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండా చేశారు.

ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇలా ఉంటే.. ‘తెలంగాణలో రజాకార్లను తలపించే పాలన సాగుతున్నదని.. వచ్చే ఎన్నికల్లో దానికి స్వస్తిపలికి బీజేపీ నేతృత్వంలో రామరాజ్యాన్ని తీసుకురావాలని’ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన ‘హిందూ ఏక్తా ర్యాలీ’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏక్తా ర్యాలీకి ముందురోజు కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇలాంటి విద్వేష, విభజన రాజకీయాలకు, కుల, మత రాజకీయాలకు వ్యతిరేకంగానే వచ్చాయి. దేశంలోని ప్రజలంతా రాజ్యాంగబద్ధ పాలన కావాలని కోరుతున్నారు. ప్రజల మధ్య విభజన రేఖలు గీసే రాజకీయాలను నిరసిస్తున్నారు. అయినా బీజేపీ నేతల వైఖరి మాత్రం మారడం లేదు.

అందుకే కర్ణాటక ఎన్నిక ప్రచారంలో ప్రధాని నినదించిన ‘జై బజరంగ్‌దళ్‌’కు ఓట్లు వేయలేదు. రాజకీయ అవసరాల కోసం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి లింగాయత్‌, వొక్కలిగ వర్గాలకు కేటాయించినా.. ఆ వర్గాలు కూడా బీజేపీకి ఓటు వేయలేదు. అంతేకాదు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను కూడా ప్రధాని తమ ప్రచారానికి వాడుకున్నారు. అది కూడా కాషాయపార్టీని కాపాడలేదు.

అలాగే ఆర్టికల్‌ 370 విషయంలో ఎవరూ ఊహించని మేలు జరిగిందని హిమంత అన్నారు. సంఖ్యాబలం ఉన్నదని ఆ ఆర్టికల్‌ రద్దు చేశారు. మోడీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆ ఆర్టికల్‌ రద్దు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడి నేతలపై ఆంక్షలు కొనసాగిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జీ20 అధ్యక్ష పదవిలో ఉన్న భారత్‌ జీ20 సమావేశాలను కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.

పర్యాటక రంగంపై మే 22-24ల మధ్య శ్రీనగర్ లో ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్రం వెల్లడించింది. ఈ రెండేళ్లకు పైగా దేశంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా, కశ్మీర్‌లో ఎందుకు నిర్వహించడం లేదనే ప్రశ్న తలెత్తుతూనే ఉన్నది. అక్కడి ప్రజల అభిప్రాయం ఏమిటి అన్నది హిమంత బిశ్వశర్మ లాంటి వాళ్లకు ఎన్నికల ద్వారానే తెలుస్తుంది.

దేశంలోని కేంద్ర పాలిత ప్రాంత ప్రజలైనా, రాష్ట్రాల ప్రజలైనా రాజ్యాంగ ప్రకారం రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసిన విధంగా రాజ్యాంగబద్ధ పాలననే కోరుకుంటున్నారు కానీ రామరాజ్యం కావాలని ఎవరూ అడగడం లేదు. ఇది బీజేపీ ప్రచారానికే కానీ ప్రజలకు దానితో ఒనగూరే ప్రయోజనమేమీ లేదు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular