ESA విధాత: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళుతున్న రాకెట్లను చూశాం. కానీ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడు చూసి ఉండం. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే భగ్గున మండిపోతాయని వినడమే తప్ప దృశ్యాన్ని చూసింది లేదు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) విడుదల చేసిన ఫొటోతో ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో మనకు ఒక అంచనా వచ్చే అవకాశముంది. ఈఎస్ఏ కు చెందిన ఏలస్ అనే ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న ఫొటో అది. […]

ESA
ESA
విధాత: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళుతున్న రాకెట్లను చూశాం. కానీ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడు చూసి ఉండం. అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే భగ్గున మండిపోతాయని వినడమే తప్ప దృశ్యాన్ని చూసింది లేదు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) విడుదల చేసిన ఫొటోతో ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో మనకు ఒక అంచనా వచ్చే అవకాశముంది.
ఈఎస్ఏ కు చెందిన ఏలస్ అనే ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న ఫొటో అది. అది అలా మన వాతావరణంలోకి ప్రవేశించగానే.. అణువుల తాకిడికి చిటికెలో కాలి బూడిదైపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే తీసిన ఫొటో (Blazing Photo of Satellite) ను ఈఎస్ఏ (European Space Agency) విడుదల చేసింది.
ఇందులో కణకణ మండుతున్న నిప్పు కణికల సమాహారంగా శాటిలైట్ కనిపిస్తోంది. 2018లో ప్రయోగించిన ఈ ఏలస్‌కు అత్యంత శక్తిమంతమైన లేజర్ సాంకేతికతను అమర్చారు. తద్వారా భూమిపై సాగుతున్న వివిధ పవన ప్రవాహాలను అంచనా వేసేది. ఇలా ఇప్పటి వరకు వివిధ ప్రకృతి విపత్తులను పసిగట్టడంలో, హెచ్చరికలు జారీ చేయడంలో ఎంతగానో ఉపయోగపడింది.
ఈ నెల జులైలో తన జీవిత కాలం పూర్తి కావడంతో.. అంతరిక్ష చెత్తలో అదీ ఒక చిన్న భాగంగా మారి పోయింది. విఫలమైన, జీవిత కాలం పూర్తయిన ఉపగ్రహాలు తమకు తాముగా భూ వాతావరణంలోకి వచ్చి మండిపోవడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశముంది.
ఇలా పేరుకుపోయిన శాటిలైట్ చెత్త వల్ల భవిష్యత్తు ప్రయోగాలకు ఆటంకం ఏర్పడే ప్రమాదముంది. దీంతో శాటిలైట్ బూడిదగా మారే ప్రక్రియను త్వరగా కానిచ్చేయాలని భావించిన ఈఎస్ఏ అసిస్టెడ్ రీ ఎంట్రీ అనే విధానంలో ఉపగ్రహం భూ వాతావరణంలోకి వచ్చేలా చేసింది.
చిన్న చిన్నగా దాని ఎత్తును తగ్గిస్తూ రాగా.. ఒక్కసారి భూ గురుత్వాకర్షణ పరిధిలోకి రాగానే.. ఏలస్ రివ్వును భూమి వైపు దూసుకురావడం మొదలుపెట్టింది. దాని వేగానికి.. భూ వాతావరణంలో ఉండే అణువులు రాపిడికి గురై మంటలు చుట్టుముట్టి బూడిద చేశాయి.
ఉపగ్రహాలు సహజంగా భూ వాతావరణంలోకి ప్రవేశించినపుడు మండిపోయినా.. కొన్ని భాగాలు నేలపై పడే అవకాశముందని ఈఎస్ఏ తన ప్రకటనలో పేర్కొంది. అవి జనసమ్మర్థ ప్రాంతాల్లో పడితే తీవ్ర గాయాలు కావచ్చు.. కొన్ని సార్లు ప్రాణాలూ పోవచ్చు. అందుకే తామే స్వయంగా తక్కువ జనాభా ప్రాంతంలో ఈ క్రతువును పూర్తి చేశామని వెల్లడించింది.
