Chandrababu Naidu | స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ మొత్తం రూ. 241 కోట్లు దారిమళ్లించినట్లు కేసు విధాత: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్50(1) నోటీసు ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ-1గా […]

Chandrababu Naidu |
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- మొత్తం రూ. 241 కోట్లు దారిమళ్లించినట్లు కేసు
విధాత: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్50(1) నోటీసు ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్టు చేశారు.
ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120బీ, 166, 167, 418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 అండ్ 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం విచారణ జరిపి దాదాపు రూ. 241 కోట్లను చంద్రబాబు డొల్ల కంపెనీల పేరుతొ తనఖాతాలకు మళ్లించుకున్నట్లు గుర్తించింది.
బ్రేక్ ఫాస్ట్ కాగానే నంద్యాల నుంచి విజయవాడ తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయన కాన్వాయ్‌లోనే ఎన్ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలించనున్నారు పోలీసులు.
నంద్యాలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు రాత్రి బస చేయగా, అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక బాబు బస చేసిన ప్రాంతానికి భారీ సంఖ్యలో పోలీసులు తరలివచ్చారు. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తానికి శనివారం ఉదయం 5 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారు. బాబు వాహనం చుట్టూ ఉన్న టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తలను చెదరగొట్టారు. అరెస్టు అయిన వారిలో కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి ఉన్నారు.
చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు న్యాయవాది స్పందించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. హైబీపీ, షుగర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. బాబుకు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 37వ ముద్దాయిగా పేర్కొన్నారని న్యాయవాది తెలిపారు.
ఇదే కేసులో ఇప్పటికే మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతోబాటు మొత్తం డబ్బు దారిమళ్ళడానికి ప్రధాన వేదికగా నిలిచినా డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులను సైతం ఈడీ ఎటాచ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ,మనోజ్ పార్ధసాని, యోగేష్ గుప్తాలకు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు సంస్థ.
