Tuesday, January 31, 2023
More
    Homelatestతండ్రికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన కన్న బిడ్డలు

    తండ్రికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన కన్న బిడ్డలు

    • రేకులతండాలో ఆవిష్కరించిన మంత్రి
    • గ్రామస్తుల అభినందనలు

    విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సాకేందుకు వెనకంజ వేసి ఇండ్ల నుంచి తరిమేస్తున్న ప్రస్తుత తరుణంలో తండ్రి కోసం కన్నబిడ్డలంతా కలిసి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. తండ్రి జ్ఞాపకంగా సొంత ఊర్లో సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరి మన్ననలు పొందారు.

    ఇటీవలనే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన మార్త అనే వృద్ధురాలిని కన్న కుమార్తె ఆస్తి, డబ్బు తీసుకొని ఇంటి నుంచి బయటికి గెంటి వేసిన సంఘటన తెలిసిందే. ఈ వృద్ధురాలి అవస్థలు గుర్తించిన పోలీసులు ఆమెకు సొంత ఇంటిని నిర్మించి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

    ఇలాంటి దారుణాలు జరుగుతున్న సమయంలో తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన మంచితనాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేయడం విశేషం. ఈ విశేషం మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం, రేకుల తండాలో జరిగింది. తండ్రి తేజావత్ సక్రాం నాయక్ కాంస్య విగ్రహాన్ని కొడుకులు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు.

    సక్రాం నాయక్ కుమారులు తేజావత్ కృష్ణా నాయక్, తేజావత్ రాంబాబు నాయక్, సరోజ, శారద, పద్మ ఐదుగురి సంతానాన్ని మంత్రి అభినందించారు. తల్లిదండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈరోజుల్లో తండ్రి గుర్తుగా భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. సక్రాం నాయక్ ఎంతో సేవా భావం కలిగిన వ్యక్తి అని, మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు.

    కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, కురవి జెడ్పీటిసి బండి వెంకట్ రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, గుగులోత్ శ్రీరామ్ నాయక్, ఆంగోత్ శ్రీకాంత్ నాయక్, భాను, జగదీష్ నాయక్, తేజావత్ కవితదర్శి నాయక్, బొజ్జ నాయక్, రామచంద్రనాయక్, రంగమ్మ, రాజు నాయక్, అర్జున్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular