Tuesday, January 31, 2023
More
  HomelatestBRS అడుగులు ఎటువైపు..! ఎవ‌రికి లాభం..!

  BRS అడుగులు ఎటువైపు..! ఎవ‌రికి లాభం..!

  విధాత‌: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడుగులు ఎటువైపు పడుతున్నాయి అనేది రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకమని, మూస రాజకీయాలకు విరుగుడు అని బిఆర్ఎస్ ప్రచారం చేస్తున్నప్పటికీ నమ్మశక్యంగా లేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

  దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) గా మార్చినట్లు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలకు భిన్నంగా ప్రజా సంక్షేమం ధ్యేయంగా తమ విధానాలు ఉంటాయని బిఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిఆర్ఎస్ నాయకుల ప్రకటనలు బిజెపిని ఎదిరించే విధంగా ఉన్నా అంతర్గతంగా ఆ పార్టీకి మేలు కలిగే విధంగా వ్యవహరిస్తున్నదనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నాయి.

  ఈ ఏడాది కర్ణాటకతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ పొరుగునే ఉన్న కర్ణాటకలో మే నెలలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ ఏడాది చివరన ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కూడా ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

  టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా అవతరించిన తరువాత ఇతర రాష్ట్రాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే కార్యకలాపాలు ప్రారంభించారు. మాజీ జనసేన, ప్రజారాజ్యం పార్టీ నాయకులు క్యూ కట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం నాయకుడు టిజె.ప్రకాశ్, జాతీయ కాపునాడు అధ్యక్షుడు తాడిపాక రమేష్ నాయుడు, కాపునాడు ప్రధాన కార్యదర్శి గిద్దల శ్రీనివాస్ నాయుడు, ఏపి ప్రజా సంఘాల జేఏసి అధ్యక్షుడు జెజె.రామారావు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

  మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను ఏపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఖరారు చేసి, ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి సారించాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఏపిలో బిఆర్ఎస్ విస్తరణ అంశంపై తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్ పలువురితో చర్చిస్తున్నారు.

  విజయవాడ, నూజివీడు ప్రాంతాలకు చెందిన వంశీరావు, సతీష్ రావు నేతృత్వంలో పలువురు నాయకులతో చర్చలు జరిపారు. అయితే జనసేన, టిడిపి పార్టీల నుంచి వలసలు వచ్చేలా వ్యూహం రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

  ప్రముఖ మైనింగ్ వ్యాపారి, బిజెపి నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్ పిపి) రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే మే నెలలో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.

  గాలి జనార్థన్ రెడ్డి బిజెపికి అనుకూలమా, వ్యతిరేకమా అనే చర్చ అప్పుడే మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యూలర్) తో కలిసి పోటీ చేస్తామని బిఆర్ఎస్ ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశారు.

  మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించి, కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన మారిన పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి, కెసిఆర్ కు దగ్గరయ్యారు. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది.

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో ఈ కొత్త బంధం తెరమీదికి రావడం, గాలి జనార్థన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడం ఏ పార్టీని అడ్డుకోవడం కోసం అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బిజెపిని మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకేనా అనే వాదనలకు ఈ బంధం బలం చేకూర్చుతుందని అంటున్నారు.

  కర్ణాటక రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన మహబూబ్ నగర్, వికారాబాద్, మెదక్ జిల్లాల వాసులకు కన్నడిగులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ జిల్లాల నాయకులకు కర్ణాటకలో పార్టీని బలపర్చే బాధ్యతను బిఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది.

  మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలుగువారు నివసించే ప్రాంతాలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దృష్టి సారించారు. యావత్మల్ జిల్లా వణిలో జోగు రామన్న, నాందేడ్ జిల్లా కిన్వత్ నియోజకవర్గంలో బోథ్ ఎమ్మెల్వే బాపురావు, బోకర్ లో మంత్రి ఇంద్రకర్ రెడ్డి, విఠల్ రెడ్డి లు పర్యటించారు.

  కీని గ్రామంలో పలువురు నాయకులు బిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తారని, భారీ ఎత్తున చేరికలు ఉంటాయని ప్రకటించారు.

  మహారాష్ట్రలో ప్రస్తుతం బిజెపి, శివసేన బహిష్కృత నేత ఏకనాథ్ షిండే ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిఆర్ఎస్ రంగంలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోనున్నట్లు పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు కూడా.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular