Wednesday, December 7, 2022
More
  HomelatestBRS బ‌లం పుంజుకునేనా.. బాహుబ‌లిగా ఎదిగేనా! (ప్రత్యేక కథనం)

  BRS బ‌లం పుంజుకునేనా.. బాహుబ‌లిగా ఎదిగేనా! (ప్రత్యేక కథనం)

  బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా నిల‌బ‌డేనా..!

  ఉన్నమాట: తెలంగాణ రాష్ట్రంలో ఎదురు లేని శ‌క్తిగా ఎదిగిన టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్ర‌త్యామ్నాయ‌ శ‌క్తిగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న‌ది. ఆ క్ర‌మంలోనే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా పేరు మార్చి ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో రిజిష్ట‌ర్ కూడా చేశారు. గ‌త కొంత కాలంగా న‌రేంద్ర మోదీ పాల‌నా విధానాలను వ్య‌తిరేకిస్తూ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ఒక జాతీయ పార్టీనే నెల‌కొల్పి తాడో పేడో తేల్చుకునే దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే న‌లుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసే క్ర‌మంలో బీజేపీ దూత‌లుగా వ‌చ్చిన వారు అడ్డంగా దొరికిపోయిన ఘ‌ట‌న కేసీఆర్‌కు పెద్ద అస్త్రంగా చేతికందింది.

  ఈ నేప‌థ్యంలోనే బీఆర్ ఎస్ పురోగ‌తిపై దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విస్తృతంగానే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. గ‌తంలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఏవీ స‌ఫ‌లం కాలేద‌ని కొంద‌రు ఉదాహ‌ర‌ణ‌ల‌తో ఉటంకిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ హ‌యాంలో ఇందిర నియంతృత్వ పోక‌డ‌ల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌లోని వృద్ధ‌త‌రం నేత‌లంతా ఏక‌మ‌య్యారు. ఇందిరాగాంధికి ఎదురొడ్డి నిలిచారు. దేవ‌రాజ్ అర్స్ నేతృత్వంలో అర్స్ కాంగ్రెస్, కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి నేతృత్వంలో రెడ్డి కాంగ్రెస్ ఉనికిలోకి వ‌చ్చాయి. ఇవి ఎక్కువ కాలం మ‌న‌లేక క‌నుమ‌రుగైపోయాయి.

  మ‌రో వైపు.. పాత త‌రం లోహియా వాదులు, సోషలిస్టులు ఏక‌తాటి పైకి వ‌చ్చి కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌తా పార్టీ ఏర్పాట‌య్యింది. ఇందిరాగాంధీని ఓడించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోగ‌లిగినా పూర్తి కాలం అధికారం నెర‌ప‌లేక పోయింది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో కుదేలై పోయింది. ఆ త‌ర్వాత కాలంలో చ‌ర‌ణ్‌సింగ్‌, దేవీలాల్‌, కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా పార్టీలు ఏర్పాటు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇలాంటివే చిన్నా చిత‌కా ప్ర‌య‌త్నాలు జ‌రిగినా అవేవీ ప‌ది కాలాల పాటు నిలవ‌లేక పోయాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు.

  కానీ ఇప్పుడు మోదీ హ‌యాంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ ఎస్ ముందుకు రావ‌టం ఓ ప్ర‌త్యేక సంక్లిష్ట‌ సంద‌ర్భం. దేశ వ్యాప్తంగా మోదీ అనుస‌రిస్తున్న వ్య‌క్తివాద నియంతృత్వ పోక‌డ‌ల‌ను బీజేపీయేత‌ర విప‌క్షాల పాల‌న‌లోని ప్ర‌భుత్వాల‌న్నీ వ్య‌తిరేకిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ అనుస‌రిస్తున్న మెజారిటీ వాద నియంతృత్వ విధానాల‌ను నిర‌సిస్తున్నాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దు మొద‌లు, దేశంలో ఒకే ప‌న్ను విధాన‌మంటూ తెచ్చిన జీఎస్టీ, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ లాంటి వాటిని విప‌క్ష పార్టీల‌న్ని వ్య‌తిరేకిస్తున్నాయి, ఉద్య‌మిస్తున్నాయి. ముఖ్యంగా స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ అనుస‌రిస్తున్న ఏకప‌క్ష ఆధిప‌త్య విధానాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. బీజేపీ అనుస‌రిస్తున్న విభ‌జ‌న రాజకీయాల‌కు వ్య‌తిరేకంగా లౌకిక ప్ర‌జాస్వామిక శ‌క్తుల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి సంఘ‌టితంగా క‌ద‌లాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తున్నాయి.

  ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ ఎస్ బీజేపీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ముందుకు వ‌చ్చింది. అయితే గ‌తంలో ఎప్పుడూ, ఎవ‌రికీ లేని ప్ర‌త్యేక‌త‌లు నేడున్నాయి. కేంద్రంలో అధికార పాల‌క పార్టీగా మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్వ‌త్రా విఫ‌ల‌మైందన్న‌ది సామాన్యుని దాకా అర్థ‌మై పోయింది. పెరిగిన నిత్యావ‌స‌ర ధ‌ర‌లు, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను త‌గ్గించే విష‌యం కాకుండా…, ప్ర‌జ‌ల దైనందిన జీవితంతో సంబంధం లేని, ఆకుకు అంద‌ని, పోక‌కు పొంద‌ని విష‌యాల‌తో మోదీ కాలం వెల్ల‌దీస్తున్నార‌న్న‌ది తేట‌తెల్ల‌మైంది.

  స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న ఎవ‌రు ఎలా అందించ‌గ‌ల‌రో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించాలి. ఇవ్వాల కేసీఆర్ త‌న ఎనిమిదేండ్ల పాల‌నా కాలంలో తెలంగాణ‌లో అందించిన సంక్షేమ‌, అభివృద్ధే త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ఆశ‌తో ఉన్నారు. తాగు, సాగు నీటి రంగంలో తెలంగాణ‌లో వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు దేశానికి ఆద‌ర్శంగా, అనుస‌ర‌ణీయంగా నిలిచిన స్థితి త‌న‌కు పెద్ద వ‌న‌రుగా భావిస్తున్నారు.

  అంతే కాకుండా.. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను, దేశ స‌మ‌స్య‌ల‌ను, ప‌రిష్కారాల‌ను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడి అంద‌రినీ మెప్పించి, ఒప్పించే శ‌క్తి కేసీఆర్ సొంతం. ఈ విధ‌మైన వ్య‌క్తీక‌ర‌ణ దేశంలో మ‌రే నేత‌కు లేద‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డి ప్ర‌భావం చూప‌లేని పార్టీగా మిగిలిపోయిన స్థితిలో ఆ రాజ‌కీయ‌ శూన్యత‌ను బీఆర్ఎస్ పూడ్చ‌ గ‌లిగితే దేశ‌వ్యాప్తంగా ప్ర‌బ‌ల శ‌క్తిగా ఎదిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అయితే.. ఈ సంక్లిష్ట‌, సంక్షుభిత ప‌రిస్థితుల‌ను కేసీఆర్ ఎంత నేర్పుతో, ఓర్పుతో దేశ ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా మ‌ల్చ‌గ‌ల‌రో కాల‌మే తేలుస్తుంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page