విధాత: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పు వెల్లడించిన కొన్నిగంటల్లోనే సోమేశ్‌కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల వాఖ (డీవోటీపీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసింది.
ఈ నెల 12వ తేదీలోగా ఏపీ ప్రభుత్వంలో చేరాలని,ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అలాగే కొత్త సీఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కాబట్టి సీఎస్‌ను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు నేడు వెలువరించే అవకాశం ఉన్నది.
స్వచ్ఛంద పదవీ విరమణవైపే మొగ్గు
హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సీఎస్ సీఎంతో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని సూచించినట్లు సమాచారం. తనను డిప్యూటేషన్‌పై సీఎస్ కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నది. దీనిపై సీఎం లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరుధ్యాలు తారాస్థాయికి చేరాయి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం కష్టమే.
ఇంకా 11 నెలల సర్వీస్ ఉన్నసోమేశ్ సీఎస్‌గా ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. సీఎస్‌గా పనిచేసిన ఆయన ఏపీలో మరో పోస్టులో పనిచేయకపోవచ్చు. ఎందుకంటే విభజన సమస్యలతో పాటు ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న అనేక పరిపాలనా విభేదాలపై సీఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన అనివార్యంగా అక్కడి వెళ్లినా ఆయనకు ఇక్కడి వలె ప్రాధాన్యం దక్కదు. కనుక వీటన్నింటి దృష్ట్యా ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఆయనపై అసంతృప్తి ఉన్నా..
తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రూపకల్పనలో సీఎంతో పాటు సీఎస్ కీలక భూమిక పోషించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ధరణి వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రజలు, రైతులు, రాజకీయ ప్రతినిధుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై నమ్మకం వ్యక్తం చేస్తూనే సీఎస్ వైఖరిపై సీఎం వద్ద తమ నిరసనను అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఆయనపై గుర్రుగానే ఉన్నారని, కానీ సీఎంతో ఆయనకు ఉండే సాన్నిహిత్యంతో మౌనంగా ఉన్నట్టు తెలిసింది.
హైకోర్టు తీర్పు సోమేశ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసినా..
ఇలా అనేక సమస్యల నేపథ్యంలో సీఎస్‌ను తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా హైకోర్టు తీర్పు సోమేశ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసినా.. ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించి, సోమేశ్ ఒకవేళ స్వచ్ఛందంగా వైదొలిగితే ఆయన సేవలను వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఢిల్లీలో ఆయనను ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.