విధాత: కొత్త ఏడాది ఆరంభం నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడిగా గుర్నాంసింగ్ను ప్రకటించి మిగిలిన రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులను నియమించనున్నారు. అలాగే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనకు ముందే వివిధ రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారలతో పాటు రైతు సంఘాల నేతలను చర్చించారు. దానికి అనుగుణంగానే విస్తరణ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ముందుగా ఏపీ నుంచి ఆ పని మొదలుపెట్టారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ కుమార్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథితో పాటు వివిధ జిల్లాల నుంచి నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు ఆ రాష్ట్రంలోని వివిధ పార్టీల్లో పనిచేసిన వారు. ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని నిలువరించడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే అందరికీ పోటీచేసే అవకాశాలు దక్కకపోవచ్చు. కొంతమంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. అలాగే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, పాలెరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం, ఆమె తల్లి విజయమ్మ కూడా తన బిడ్డను ఆశ్వీర్వదించాలని కోరడం జరిగిపోయాయి.
ఇక్కడ వైఎస్ఆర్ పాలన రావాలంటున్నవారు ఏపీలో అలాంటి పాలన కొనసాగుతున్నదా అంటే విజయమ్మ దాటవేశారు. జగన్ గురించి, అక్కడి రాజకీయాల గురించి మనకెందుకు అన్నారు. అంతేకాదు జగన్ను కేసీఆర్ టచ్ కూడా చేయలేరన్నారు. కానీ బీఆర్ఎస్ విస్తరణను అక్కడి నుంచే ప్రారంభించి ఉండొచ్చు. ఖమ్మం మెట్టు నుంచి టీడీపీ పూర్వ వైభవానికి ఇదే నాంది అని నారా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఇలా ఈ ఆరు దశాబ్దాల కాలంలో తమ రాజధానులు అనుకున్నవి అక్కడి ప్రజలకు దక్కలేదు. విభజన తర్వాత అయినా ఈ ఎనిమిదేళ్ల కాలలో ఆంధ్రులకు అంటూ చెప్పుకోవడానికి ఒక రాజధాని నగరం అంటూ లేదు. ఇదే అభిప్రాయాన్నిరాజకీయాలతో సంబంధం లేని సామాన్యుల కోరిక.
అలాగే అక్కడి రైతులు ఏపీకి వర ప్రదాయని అయిన పోలవరం నిర్మాణం పూర్తవాలని కోరుకుంటున్నారు. నిజానికి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏపీ రాజకీయాల్లో ఈ రెండు అంశాలే కీలక పాత్ర పోషించాయి. కానీ టీడీపీ గాని, ప్రస్తుత వైపీసీ గాని అక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేకపోయాయి. సచివాలయంతో పాటు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే వాటిని ఏపీలోనూ అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు.
తెలంగాణలో చంద్రబాబు ప్రభావం ఎంత అన్నది.. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఎంత అన్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేలుతుంది. తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన తమకు లేదంటున్న వైసీపీ నేతలు బీఆర్ఎస్ విస్తరణ పై దాడి మొదలుపెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరిన నేతలు గతంలో ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన, బీజేపీలో పనిచేసిన వాళ్లే. పైకి బీఆర్ఎస్పై వైసీపీ విమర్శలు చేస్తున్నా.. అంతర్గతంగా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నదా? అనే చర్చ కూడా జరుగుతున్నది. అదే జరిగితే గుజరాత్లో ఆప్ వలె ఏపీలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనక్కరలేదంటున్నారు.
కర్ణాటకలో కుమారస్వామి పార్టీతో కలిసి పోటీ చేస్తామన్నారు. ఏపీలోనూ వైపీసీతో లోపాయికారీ ఒప్పందం ఉండొచ్చు. ఓట్లు వచ్చినా, సీట్లు వచ్చినా కేసీఆర్కు అదనపు బలం. ఓడిపోతే అక్కడ కుమారస్వామి, ఇక్కడ జగన్కు నష్టం తప్పా కేసీఆర్కు పోయేది ఏమీ లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. 2014లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విలేకర్ల సమావేశంలో మీరు వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు కదా అని కేసీఆర్ను ఓ విలేకరి ప్రశ్నించాడు. నిజమే. గెలవలేదు. మరి ఏం చేద్దాం? అని ఎదురు ప్రశ్నించిన ఉదంతాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.