Nizamabad | బీఆర్ఎస్‌కు బీసీల మద్దతే కీలకం ఆ వర్గాల్లో బట్టబయలవుతున్న అసంతృప్తి అనుకూలంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ గెలుపుపై ఎవరి ధీమా వారిదే..! విధాతప్రతినిధి, నిజామాబాద్: హ్యాట్రిక్ పై కన్నేసిన గులాబీ దళం.. బీసీ, మైనార్టీ ఓట్ల ఆశతో కాంగ్రెస్, బీజేపీ గెలుపు ధీమాతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఓసీ వర్గానికి టికెట్ ప్రకటించింది. మరోమారు సిటింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను బరిలో దించింది. ఈ […]

Nizamabad |

  • బీఆర్ఎస్‌కు బీసీల మద్దతే కీలకం
  • ఆ వర్గాల్లో బట్టబయలవుతున్న అసంతృప్తి
  • అనుకూలంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ
  • గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

విధాతప్రతినిధి, నిజామాబాద్: హ్యాట్రిక్ పై కన్నేసిన గులాబీ దళం.. బీసీ, మైనార్టీ ఓట్ల ఆశతో కాంగ్రెస్, బీజేపీ గెలుపు ధీమాతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఓసీ వర్గానికి టికెట్ ప్రకటించింది. మరోమారు సిటింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను బరిలో దించింది. ఈ పరిణామంతో పార్టీ సీటు కోసం పట్టుబట్టిన బీసీ సంఘాలు, బీసీ నేతలు లోలోపలే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

అధికార పార్టీ అభ్యర్థి గెలుపునకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి పోటీకి ఆవకాశం దక్కించుకున్న బిగాల గణేష్ గుప్తాకు, ఇక్కడి బీసీ వర్గాల నుంచి ఈసారి మద్దతు లభిస్తుందా? అనేది సందేహంగా మారింది. మరోసారి మా నాయకున్ని గెలిపించుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు పోతున్నయి.

2.68 లక్షల ఓట్లు

నిజామాబాద్ అర్బన్ 50 డివిజన్లతో కలిపి నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఇక్కడ 2లక్షల 68వేల 901 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో లక్షా 30 వేల 270 మంది పురుషులు, లక్షా 38 వేల 615 మంది మహిళ లు, ఇతరులు 16 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 60 డివిజన్లుగా రూపాంతరమైంది. మున్నురు కాపు, ప‌ద్మ‌శాలి, ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌తంలో అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మున్నురు కాపులే ఏలారు. గత రెండు ప‌ర్యాయాలు వైశ్యులు చేజిక్కించుకున్నారు. వైశ్యుడైన బిగాల గ‌ణేష్ గుప్తా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

2009లో బిగాల రాజకీయ ప్రవేశం

బిగాల కృష్ణమూర్తి, సువర్ణ దంపతుల తనయుడు బిగాల గణేష్ గుప్త 1970 ఏప్రిల్ 17న స్వగ్రామం మాక్లూర్ లో జన్మించారు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వ్యాపారంలో స్థిరపడ్డాడు. 2009లో రాజకీయ ప్రవేశం చేసారు. టీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు ఇంచార్జిగా కొనసాగారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరవాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి బొమ్మ మ‌హేష్ కుమార్ పై విజ‌యం సాధించారు. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి కాంగ్రెస్ అభ్య‌ర్థి త‌హేర్ బీన్ హంద‌న్ ను 24 వేల 372 ఓట్ల మెజార్టీతో బిగాల ఓడించారు. 2014, 2018 లో రెండుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచేందుకు సీఎం కేసీఆర్ లైన్ క్లియర్ చేశారు.

అభివృద్ధి.. విమర్శలు

ఎమ్మెల్యే బిగాల నిజామాబాద్ నగర అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చారు. నగర సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్, నూతన కలెక్టరేట్ సముదాయం, ఐటీ హబ్, శ్మశాన వాటికల నిర్మాణం, కళ భవనానికి శంకుస్థాపన తదితర చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అయితే డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. నిర్మాణం పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న1500 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి కూడా పంపిణీ చేయలేదు.

దళిత బంధులో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అనుచరులకే పథకం వర్తింపజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న రఘునాథ చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ విషయంలో రూ.4 కోట్లతో మొదలైన టెండర్ ను దాదాపు రూ.35 కోట్ల వరకు వ్యయాన్నిపెంచారని, మినీ ట్యాంక్ బండ్ ను ఎమ్మెల్యే బీగాల ఒక ఏటీఎం లా వాడుకొని, ఆలస్యం చేసారని ప్రతిపక్షాలు పలుమార్లు విమర్శించాయి.

ఆ వర్గాలదే పైచేయి

నిజామాబాదు నియోజకవర్గం1952లో ఆవిర్భవించింది. నాటి నుంచి గమనిస్తే, మైనార్టీ వర్గానికి చెందిన మహమ్మద్ దవార్ హుస్సేన్ వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ తరువాత నిజామాబాదు అర్బన్ పై వరుసగా బీసీలదే పైచేయి కొనసాగింది. 1983 నుండి 1989 వరకు వరుసగా రెండు సార్లు టీడీపీకి చెందిన డీ సత్యనారాయణ గెలుపొందగా, 1989-94 ఓసారి, తిరిగి 1999-2004 , 2004-2009 వరుసగా మరో రెండు పర్యాయాలు ఇలా కాంగ్రెస్ నుంచి మూడు పర్యాయాలు ధర్మపురి శ్రీనివాస్ గెలుపొందారు.

ఆ తరువాత 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న ఎగసిపోతున్న సమయంలో బీజేపీ నుంచి యెండల లక్ష్మి నారాయణ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఇలా నియోజకవర్గం ఏర్పడ్డ మొదలు, ఇప్పటివరకు చరిత్ర చూస్తే ఎక్కువభాగం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుపొందారు.

బీఆర్ఎస్ లో బీసీ గుబులు

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి తాజాగా సీనియర్ నేతలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, కేశ వేణు.. ఇలా బీసీలే టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీజేపీ నుంచి బీసీ అభ్యర్థినే బరిలో ఉంచుతారన్న ప్రచారం సాగుతుంది. బీసీ అభ్యర్థికి టికెట్లు ఇస్తే, ఆ అభ్యర్థినే బలపరుస్తామని బీసీ సంఘాలు, బీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాదు అర్బన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా తక్కువే అని అంటున్నారు. నిజామాబాదు చరిత్రలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు. బిగాల గెలిస్తే ఆ రికార్డును బద్దలుకొట్టినట్లవుతుంది. నియోజకవర్గంలో అధిక శాతం ఓట్లు బీసీలు, మైనార్టీలే కావడం, ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి గెలుపు అంత సులువుకాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated On 4 Sep 2023 12:23 PM GMT
somu

somu

Next Story