విధాత: వనరులు, వసతులు ఉండి ఈ దేశం ప్రజలు శిక్షించబడుతున్నారు. వంచించబడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగాల్నా? ఇందులో ఏదైనా మార్పు రావాల్నా? అది ప్రశ్న? మార్పుకోసమే ప్రబలమైన, గుణాత్మకమైనటువంటి మార్పు కచ్చితంగా తీసుకొచ్చి, ప్రజల ఆలోచనా సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటటువంటి ఆలోచనాపరులను ఏకం చేసి, ఒక మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. ఖచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో మానవ జీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
మీ అందరికి స్వాగతం చెప్పడంతో పాటు చాలా పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. ఒకప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. జీవితాలను ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యలకాపాలు మొదలుపెట్టాం. చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కొన్ని బాటలు వేయబడ్డాయి. సాగుతూ వచ్చాం. ఆ తర్వాత రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయి. గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్రజల కోరికలు, స్వాతంత్ర్య ఫలాలు సిద్ధించలేదు. మన కంటే అమెరికా, చైనా ముందున్నవి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉంది.
కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం బాగా, అద్భుతంగా జరగాలంటే.. సూర్యకాంతి ఉండాలి. అప్పుడే పంటలు పండుతాయి. సూర్యకాంతి కూడా అపారంగా ఉంది. మన వద్ద మూడు రకాల పర్యావరణ మండలాలు ఉంటాయి. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే వాతావరణం పలు రాష్ట్రాల్లో ఉంది.
మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు, అతిశీతలంగా ఉండే హిమాలయాలు కూడా ఉన్నాయి. ఆగ్రో క్లైమాటిక్ కండిషన్లో యాపిల్, మామిడి పండుతాయి. మన దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది. ఇది కేంద్రం చెబుతున్న లెక్క. 70 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉంది.
భూమి, సోలార్, పర్యావరణ మండలాలు ఉన్నాయి. పని చేసేటటువంటి మనషులు ఉన్నారు. తగిన పద్ధతిలో ముందుకు వెళ్తే.. ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్కలిగి ఉండే కంట్రీగా ఉండాలి. మన రైతు లోకమంతా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ 13 నెలల పాటు రైతులు ధర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.