- తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్న సర్కారు
- వరంగల్లో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవం
- మహిళా ఆరోగ్య కేంద్రాల ప్రారంభం
- ఘనంగా సర్కారు మహిళా దినోత్సవం
- నియోజకవర్గాల్లో క్రీడా,సాంస్కృతిక పోటీలు నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రూ 750 కోట్ల స్త్రీ నిధి రుణాలు మంజూరు
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తోంది. సమాజంలో సగభాగంతో పాటు ఓట్లలో సైతం మహిళలు సగంగా కొనసాగుతున్నారు. పురుష ఓట్లతో పోలిస్తే మహిళా ఓట్లను కొల్లగొట్టడం కొంత సులువైన మార్గమనే భావన అధికార పార్టీలో బలంగా ఉంది. వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. మహిళల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశాలు ఉంటాయనీ, అంతేకాకుండా వారిని ఆకట్టుకుంటే తమ వైపే ముగ్గు చూపిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం,బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన లోటుపాట్లను సవరించుకొని వారిని ఆకర్షించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. దీనికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేదికగా మలుచుకుంది.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) మార్చి 8 ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. మహిళలను ఆకట్టుకునేందుకు వీలున్న అన్ని మార్గాలను అనుసరిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆర్థిక పరమైన చేయూతని అందించడంలో అవసరమైన చర్యలు చేపట్టారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయిన విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. సామూహిక అత్యాచారాలను నిరోధించడంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని విమర్శలు నెలకొన్నాయి. ఇదే సమయంలో మెడికో డాక్టర్ ప్రీతి (Dr. Preeti) మృతి సంఘటన కూడా వరంగల్ లోనే జరిగిన విషయం తెలిసిందే.
వరంగల్ కేంద్రంగా కార్యాచరణ
ఈ నేపథ్యంలో అటు రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం, ఇటు ప్రభుత్వం పై పెరిగిన విమర్శలకు సమాధానం చెబుతూ అవకాశమున్న మేరకు అన్ని రకాలుగా మహిళలను సంతృప్తి పరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీనికి ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాను కేంద్రంగా ఎంచుకొని తమ వ్యూహాన్ని అమలు చేయడం విశేషం.
వరంగల్లో మహిళా దినోత్సవం
రాష్ట్ర ఆవిర్భావం నుంచి హైదరాబాదులోనే జరిగిన రాష్ట్రస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈసారి హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం గుర్తించాల్సిన అంశం. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం కూడా ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆరోగ్య శిబిరం, భారీ సభ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో నిర్వహించినప్పటికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) ప్రాతినిధ్యం వహిస్తున్న తొర్రూరు పట్టణంలో అదే రోజు భారీ మహిళా సభను నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR0 ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు.
రూ.450 కోట్ల నిధులు విడుదల
మహిళా దినోత్సవం సందర్భంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న రూ.450 కోట్ల స్త్రీ నిధి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. అభయ హస్తం అమలు చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గ మహిళలకు 10,000 కుట్టు మిషన్లు అందజేస్తామని చెప్పారు. ఇతర కార్యక్రమాలతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
భారీ క్యాన్సర్ ఉచిత పరీక్ష శిబిరం
మహిళా దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ బోర్డు చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) స్వగ్రామమైన ఏనుగల్లులో భారీ స్థాయిలో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ప్రతిమ హాస్పిటల్ ద్వారా నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా హాజరైన విషయం తెలిసిందే.
మహిళలకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. మహిళలకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించింది. ప్రతి మంగళవారం వారికి 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు. మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆటల పోటీలు
మహిళా దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామయ్యే విధంగా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ మేరకు నియోజకవర్గస్థాయిలో క్రీడా పోటీలు, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నియోజకవర్గాలలో మహిళల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో
ప్రభుత్వ పరంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలను నిర్వహిస్తూ వచ్చారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం ఈ కార్యాచరణలో భాగంగానే చెప్పవచ్చు. మొత్తంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు ఇప్పటినుంచే ప్రభుత్వం పరంగా, అధికార పార్టీ తమ సర్వశక్తులను వినియోగిస్తోంది.