BRS | దివాకర్‌రావుపై అరవింద్‌రెడ్డి అసమ్మతి దుర్గం చిన్నయ్యకు శేజల్ నుంచి కష్టాలు బీఫాం చేతికి వచ్చేదాకా నేతల్లో గుబులు విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మళ్లీ టికెట్ లభించినప్పటికీ.. అసమ్మతి సెగలు, ఆరోపణల మంటలతో ఇద్దరూ సతమతమవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోయినా.. ఉన్న పంచాయతీలతో తల పట్టుకుంటున్నారు. టికెట్ వచ్చిందని సంతోషం ఉన్నా.. కీలకమైన బీఫాం […]

BRS |
- దివాకర్‌రావుపై అరవింద్‌రెడ్డి అసమ్మతి
- దుర్గం చిన్నయ్యకు శేజల్ నుంచి కష్టాలు
- బీఫాం చేతికి వచ్చేదాకా నేతల్లో గుబులు
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మళ్లీ టికెట్ లభించినప్పటికీ.. అసమ్మతి సెగలు, ఆరోపణల మంటలతో ఇద్దరూ సతమతమవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోయినా.. ఉన్న పంచాయతీలతో తల పట్టుకుంటున్నారు. టికెట్ వచ్చిందని సంతోషం ఉన్నా.. కీలకమైన బీఫాం అందేనా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో బీఆరెస్ తరఫున మూడో ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఉన్నారు. తొలుత వీరికి టికెట్ దక్కుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు వ్యతిరేకంగా ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్‌మోహన్‌రావు టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పురాణం సతీశ్, అరవింద్‌రెడ్డి, పార్టీలోని మరో ఇద్దరు బీసీ నాయకులు కూడా ఆశపడ్డారు.
అయినా దివాకర్‌రావుకే అవకాశం దక్కింది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అసమ్మతి లేనప్పటికీ.. ఆరిజాన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ నుంచి పెద్ద తలనొప్పులే ఉన్నాయి. లైంగికంగా వేధిస్తున్నాడని శేజల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను పక్కనపెడతారని అంతా ఊహించారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం దుర్గయ్యకే మళ్లీ టికెట్ ఇచ్చారు.
మంచిర్యాలలో అసమ్మతి
మంచిర్యాల టికెట్‌ను దివాకర్‌రావుకు ఇచ్చిన దగ్గర నుంచి అసమ్మతి క్రమంగా రాజకుని.. ఇప్పుడు సెగలు గక్కే స్థితికి చేరుకున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేకించి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఈ అసమ్మతి ఎక్కువగా కనిపిస్తున్నది. దివాకర్‌రావుకు టికెట్ ఇచ్చారన్న అసంతృప్తితో లక్షెట్టిపేట, దండేపల్లి ప్రాంతాలలో కొందరు కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
హాజీపూర్ మండలంలో ఇంకొంతమంది దివాకర్‌రావుతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ అసమ్మతి రాజేస్తున్నారని అంటున్నారు. రూరల్ ప్రాంతాల్లో తప్పించి జిల్లా కేంద్రంలో అసమ్మతి లేదనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా బీఆరెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి రూపంలో అసమ్మతి భగ్గుమన్నది. ఇటీవల ఉద్యమకారులను ఏకతాటి పైకి తెచ్చిన ఆయన అసమ్మతి గళాన్ని గట్టిగా లేవనెత్తారు.
అరవింద్‌రెడ్డి తన నివాసంలోనే ఉద్యమకారుల సమావేశం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి, రాబోయే ఎన్నికల్లో దివాకర్‌రావుకు బీఆరెస్ అడ్రస్ గల్లంతేనని, వారంలో అభ్యర్థిని మార్చాలని వార్నింగ్ ఇవ్వటం పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నది. మొత్తానికి నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బెల్లంపల్లికి శేజల్ తలనొప్పి
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టికెట్ కన్ఫర్మ్ వచ్చినా.. ఆయనకు అరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ రూపంలో తలనొప్పి వెంటాడుతున్నది. ఏడు నెలలుగా చిన్నయ్యపై శేజల్ పోరాటం చేస్తున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తమ సంస్థ అమ్మిన భూములను సైతం ఇతరులకు అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
వాళ్లు పట్టించుకోలేదంటూ ఢిల్లీ వెళ్లి ఆందోళన చేశారు. ఇప్పుడు చిన్నయ్యకు మళ్లీ టికెట్ రావడంతో ఎలాగైనా ఓడించాలనే సంకల్పంతో ఇంటింటికీ తిరుగుతూ, ఆయనకు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. ఇది తీవ్రరూపం దాల్చితే ఎక్కడ అధిష్ఠానం బీఫాం నిరాకరిస్తుందోనన్న గుబులు ఎమ్మెల్యే అనుచరుల్లో వ్యక్తమవుతున్నదని సమాచారం.
బాల్క సుమన్‌కు తాజా టెన్షన్
‘కాంగ్రెస్ వాళ్లు కూడా మనోళ్లే.. వాళ్లను ఏమనకండి. మన వాళ్ళనే కాంగ్రెస్‌లోకి పంపాం’ అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి. దీనిపై సీఎం సీరియస్ అయ్యారని, బాల్క సుమన్‌ను మందలించారని సమాచారం. దీని ప్రభావం ఏమన్నా ఉంటుందా? అనేది చూడాల్సి ఉన్నది.
