విధాత: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) నోటీసులపై ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మీడియాతో మాట్లాడారు. ఈడీ (ED) దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తాను.. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని కవిత స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద దీక్ష అయిపోయిన తర్వాత 11వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతానని కవిత ప్రకటించారు.
కేంద్రానికి గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలతో ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం మోదీకి అలవాటైందన్నారు కవిత. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానం అని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కేంద్రం ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఈడీ, సీబీఐ(CBI), ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయించి, బెదిరింపులకు పాల్పడుతోందని కవిత మండిపడ్డారు.
ఈ దేశంలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా మారుతుంది కాబట్టే.. కేసీఆర్‌ను మోదీ టార్గెట్ చేశారని కవిత తెలిపారు. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు అని కవిత నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ ఎందుకు హాజరు కావడం లేదని కవిత ప్రశ్నించారు. బీజేపీకి వంత పాడే నాయకులపై, ఆ పార్టీలో చేరే వారిపై ఎలాంటి కేసులు ఉండవు. బీజేపీ విధానాలను ప్రశ్నించే వారిపై మాత్రమే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు.. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని కవిత స్పష్టం చేశారు.
Read more>>