HomelatestBandi Sanjay | కర్ణాటక కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బు: బండి సంజయ్

Bandi Sanjay | కర్ణాటక కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బు: బండి సంజయ్

Bandi Sanjay

  • సీఎంకు రైతుల ప్రయోజనాల కన్నా.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం
  • 3000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో ఎంతమంది రైతులకు ఇచ్చారు
  • కర్ణాటకలో కాంగ్రెస్కు నిధులు సమకూరుస్తున్నది కేసీఆర్
  • కర్ణాటక ప్రజలు బిజెపికి పట్టం కట్టనున్నారు

విధాత బ్యూరో, కరీంనగర్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రాష్ట్రంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు వారి సమస్యలను గాలికి వదిలి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటన వెళ్లారని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఆరోపించారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్ డి ఆర్ ఎఫ్ కింద కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 3 వేల కోట్ల నిధుల్లో పంట నష్టపోయిన రైతులకు ఎంతమందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేకపోయింది అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రతి ఎకరాకు పదివేల పరిహారం ఇస్తామని ప్రకటించినా, ఇదివరకు పైసా విధిల్చింది లేదన్నారు. మాటల్లో తప్ప చేతల్లో ఆయన ఏమీ చేయలేరని స్పష్టమైపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే 30% పంట కాపాడగలిగే వారన్నారు.

మద్య మానేరు నిర్వాసితులు గత 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా, కేసీఆర్ స్వయంగా వారికి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదన్నారు. మధ్య మానేరు నిర్వాసితుల్లో కేసీఆర్ అత్తగారి ఊరు కూడా ఉందని… పిల్లను ఇచ్చిన పాపానికి మోసపోయామని ఆ గ్రామస్తులు బాధపడుతున్నారని చెప్పారు. మద్య మానేరు నిర్వాసితులకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. మధ్య మానేరు నిర్వాసితుల న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం బిజెపి వారికి అండగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ఓవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నా, అవేవీ పట్టించుకోని కేసీఆర్ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో చెల్లని రూపాయి.. ఇతర రాష్ట్రాలలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ తామే కొంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం సమాధానం చెప్తుంది అన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్న విషయాన్ని రైతులు గుర్తించారన్నారు. రైతులకు మేలు జరిగితే బిజెపికి ఓటేస్తారన్నా భయంతో, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

దాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు లేవని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. 1600 కోట్లతో సెక్రటేరియట్ కడితే చిరుజల్లులకే అది కురుస్తుందని ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం అన్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బు

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావే నని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం పంపిస్తున్నాడని విమర్శించారు. ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు.

బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ చెప్పడంతోనే ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న బజరంగ్ దళ్ ను నిషేధించి, విధ్వంసాలకు కారణమవుతున్న పిఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏమిటన్న భయంతోనే అక్కడి హిందువులంతా ఒకటయ్యారని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటకలో వచ్చేది మోడీ రాజ్యమే అన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular