BRS | ప‌థ‌కాల‌పై ప్ర‌చారాలు ఫుల్‌, అమ‌లు నిల్‌ అమ‌లు చేయ‌డంలో తీవ్ర జాప్యం బీఆరెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ విధాత, హైదరాబాద్: బీఆరెస్‌ ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చినా వాటి గురించి ప్రచారం మాత్రం జోరుగా చేస్తుంది. రాష్ట్రంలో పుట్టిన పసి కందు నుంచి పండు ముసలి వరకు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లబ్దిపొందని వారు ఎవరు ఉండరని గప్పాలు కొడుతది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం వాటికి భిన్నంగా పరిస్థితులు ఉంటున్నాయి. సంక్షేమ […]

BRS |

  • ప‌థ‌కాల‌పై ప్ర‌చారాలు ఫుల్‌, అమ‌లు నిల్‌
  • అమ‌లు చేయ‌డంలో తీవ్ర జాప్యం
  • బీఆరెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌

విధాత, హైదరాబాద్: బీఆరెస్‌ ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చినా వాటి గురించి ప్రచారం మాత్రం జోరుగా చేస్తుంది. రాష్ట్రంలో పుట్టిన పసి కందు నుంచి పండు ముసలి వరకు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, లబ్దిపొందని వారు ఎవరు ఉండరని గప్పాలు కొడుతది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం వాటికి భిన్నంగా పరిస్థితులు ఉంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు చేసే విషయంలో మాటి మాటికి సీఎస్ కానుంచి మొదలు త‌దిత‌ర‌ ఉన్నతాధికారులు వరకు సమీక్ష సమావేశాలు నిర్విస్తున్నారు.

కానీ వాటి అమలు చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నది. దళిత బంధు, బీసీ, కులవృత్తుల కొరకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, తాజాగా గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇండ్లు లాంటి పథకాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని చెప్పవచ్చున‌ని, ముఖ్యంగా దళిత బంధు పథకం మూలంగా బీఆరెస్‌కు ఓ రకంగా నష్టమే జరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా కుల వృత్తుల కోసం ఆర్థిక సహాయం పథకం వల్ల ఎమ్మెల్యేలు పీక్కొలేక లక్కో లేక పోతున్నారని పలువురు ఎమ్మెల్యేలు సన్నిహితుల ముందు వాపోతున్నారు. బీఆరెస్‌ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేద వానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని సీఎం కేసిఆర్ చెప్పారు. దాదాపు మూడు ల‌క్ష‌ల ఇండ్లు ఇస్తామ‌న్న కేసీఆర్ ల‌క్ష ఇండ్లు కూడా పూర్తి చేయ‌క పోగా కొన్ని చోట్ల మెండి గోడ‌లుగానే మిగిలి పోయాయి. అర్హులైన వారికి ఇంకా అందక పోవడంతో వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు.

రాష్ట్ర ఏర్పాటు త‌రువాత ఉన్న రేష‌న్‌ కార్డులు ఊస్ట్

అహార భ‌ద్ర‌త కార్డుల జారీ ప‌క్రియ నిరంత‌రాయంగా కొన‌సాగించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత‌ రేష‌న్ కార్డులు ఇవ్వ‌కుండా పెండింగ్‌లో పెట్టారు. 2018లో ద‌ర‌ఖాస్తు చేసుకోమ‌న్న స‌ర్కారు ఆ త‌రువాత మూసి వేసింది. దాదాపు 4,46,169 ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రేష‌న్ కార్డులు లేక పోవ‌డంతో కొత్త‌గా పెళ్లైన వారు, వారి పిల్ల‌ల వివ‌రాలు రికార్డుల్లో లేక పోవ‌డం మూలంగా రేష‌న్ స‌ర‌ఫ‌రా అందుకోలేక పోతున్నారు. అది మాత్రమే కాకుండా మిగ‌తా సంక్షేమ ప‌థాకాల‌కు సైతం దూర‌మౌతున్నారు. రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో 90 ల‌క్ష‌ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. వాటిలో వివిధ కార‌ణాల‌తో 20 ల‌క్ష‌ల కార్డులు తీసి వేశారు.

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల సంగ‌తి అంతంత మాత్ర‌మే

ఇండ్లు లేని పేద‌ల కోసం డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామ‌ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రాష్ట్రంలో 2,92,538 ఇండ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. కానీ 10 ఏళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ ల‌క్ష ఇండ్లు కూడా పూర్తిగా నిర్మించ‌లేదు. దీనిపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త రావడంతో కేసీఆర్ సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ. 3 ల‌క్ష‌ల న‌గ‌దు పంపిణీ చేయ‌డం కోసం గృహ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కానికి 17 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. కానీ వాటిని ప‌రిశీలించే నాయ‌కులే క‌రువ‌య్యారు.

బీసీ కుల వృత్తుల కోసం ఆర్థిక సాయం ఎక్క‌డ‌..

ద‌ళిత బంధు త‌ర‌హాలో బీసీల‌కు కుల వృత్తుల కోసం ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌భుత్వం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తే 5.28 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలోఎ 4.25 మందిని అర్హులుగా తేల్చిన స‌ర్కారు కేవ‌లం మొద‌టి విడ‌త నియోజ‌క వ‌ర్గంలో 300 మందికి ఇస్తామ‌న్నారు. నిరంత‌ర ప్ర‌క్రియ అని చెప్పిన స‌ర్కారు ద‌ర‌ఖాస్తు దారుల‌కు ఎప్పుడు డ‌బ్బులు అందిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అట‌కెక్కిన ద‌ళితుల‌కు మూడెక‌రాల పంపిణీ

బీఆరెస్ పార్టీ 2014 ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ద‌ళితుల‌కు మూడెక‌రాలు పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత 2014 ఆగ‌స్టు 15వ తేదీన అధికారికంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. భూమి ఇవ్వ‌డంతో పాటు బోరు, మోట‌ర్‌, క‌రెంటు క‌నెక్ష‌న్ ఇప్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో పాటుగా మొద‌టి ఏడాది పెట్టుబ‌డి పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఈ ప‌థ‌కాన్ని క్షేత్ర స్థాయిలో మ‌మ అనిపించి అమలు చేయ‌కుండానే 2018 నాటికి పూర్తిగా మూసివేసింది. రాష్ట్రంలో 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 54.09 ల‌క్ష‌ల మంది ద‌ళితులు ఉన్నారు. ఇందులో 3.3 ల‌క్ష‌ల మందికి సెంటు జాగా కూడా లేదు. అయితే అట్ట‌హాసంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన ప్ర‌భుత్వం కేవ‌లం 5,607 మందికి మాత్ర‌మే భూమి పంపిణీ చేసి చేతులు దులుపుకున్న‌ది.

ద‌ళిత బంధు పంపిణీ ఏదీ

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లకు ముందు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టిన కేసీఆర్‌, యాదాద్రి జిల్లా వాసాల మ‌ర్రిలో ప్రారంభించారు. ఆత‌రువాత హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అంతా అమ‌లు చేశారు. ఎన్నిక‌ల త‌రువాత నియోజ‌క‌వ‌ర్గానికి 100 మందికి ద‌ళిత బంధు అమ‌లు అని ప్ర‌క‌టించారు. ఆత‌రువాత దీనిని నియోజ‌క వ‌ర్గానికి 1100 మందికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించారు కానీ ఎక్క‌డా కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌లేదు.

Updated On 3 Sep 2023 3:00 AM GMT
somu

somu

Next Story