విధాత: సామాన్యుడు అందరికి లోకువే. ప్రభుత్వం అంటే తానే అన్నట్లుగా వ్యవహరించే పోలీసుల విషయంలో అది మరింత ఎక్కువ. తాను అనుకున్నదే న్యాయం, చెప్పిందే చట్టం అన్నట్లుగా మన పోలీసులు అధికారాన్ని చెలాయిస్తుంటారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని కల్యాన్పూర్లో సాహిబ్నగర్ ఏరియాకు చెందిన అర్షాలన్(18) అనే యువకుడు ఓ చిరు వ్యాపారి. పొట్టకూటి కోసం కోటి కష్టాలు అన్నట్లు.. కుటుంబాన్ని పోషించుకునేందుకు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతని లాగే చాలా మంది జీటీ రోడ్డుపై కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు.
అయితే అక్రమంగా రోడ్లపై వ్యాపారం నిర్వహిస్తున్నారని పోలీసులు వారిని కొంతకాలంగా బెదిరిస్తున్నారు ఈ క్రమంలో శనివారం కూడా రోజూ ఇచ్చే మామూళ్లు రూ.50లు ఇవ్వనందుకు రెచ్చిపోయి అర్షాలన్కు చెందిన కూరగాయలను, తూకం చేసే మెషిన్‌ను పక్కనే ఉన్న రైలు పట్టాలపై పడేశారు. అయితే అర్షాలన్ చెల్లాచెదురైన కూరగాయలను ఏరుకుంటున్న తరుణంలో అప్పుడే అనుకోకుండా వచ్చిన రైలు అతని పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిరు వ్యాపారి రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అర్షాలన్పై చేయి చేసుకుని, వెయింగ్ మెషిన్‌ను పట్టాలపై పడేసిన హెడ్ కానిస్టేబుల్ రాకేశ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన జనమంతా.. పోలీసుల చర్యపై తీవ్రంగా మండి పడుతున్నారు.
గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో ఓ పాత్ర ద్వారా మంచి మాట అనిపిస్తాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అంటే.. అయితే మన ఊళ్లో హెడ్డు మారిపోతాడా? అని. అంటే ఆ ఊర్లోని పోలీసు ఆగడాలు ఇక ఉండవా అని అమాయకంగా అడుగుతాడు. కానీ ఏడు దశాబ్దాలు గడిచినా పరిస్థితులు మారటం లేదు. పోలీసులు ప్రజలకు సేవకులుగా వ్యవహరించటం లేదనటానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని స్థానికులు అంటున్నారు.
పోలీస్ దాష్టికం: రెండు కాళ్లు పొగొట్టుకున్న చిరు వ్యాపారి.. వీడియో https://t.co/1mv5y4wms1 pic.twitter.com/ismcEhs53V
— vidhaathanews (@vidhaathanews) December 3, 2022