Saturday, January 28, 2023
More
  Homelatestసుడిగాలి సుధీర్ సుడి తిరిగిందిపో! ఆ.. దర్శకుడితో సినిమా!

  సుడిగాలి సుధీర్ సుడి తిరిగిందిపో! ఆ.. దర్శకుడితో సినిమా!

  విధాత‌: నేటి జనరేషన్ ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర ద్వారా ప్రతి ఇంటిలో పరిచయం ఉన్న నటునిగా ఈయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నాడు. సినిమాలలో నటించే వారికి చాలా కాలం తర్వాత గుర్తింపు వస్తుంది. కానీ బుల్లితెర అలా కాదు.

  అది ప్రతి ఇంటిలో సాయంత్రం కుటుంబ సభ్యుల మధ్య చూసుకుంటారు. అక్కడ గుర్తింపు వచ్చిందా… ఇక ఆటోమేటిక్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇలా సినీ నటులు కావాలనుకునే వారికి బుల్లితెర అద్భుతమైన వేదిక. ముందుగా బుల్లితెర‌పై రాణిస్తే, ఆ తర్వాత ప్రతిభ ఉంటే సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

  ఇప్పటికే అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్, విష్ణుప్రియ, శ్రీముఖి వంటి అందరూ బుల్లితెర నుంచే వెండితెర‌కు పరిచయమయ్యారు. వాళ్లందరూ మహిళలు. వారికి అంతగా ఫేమ్ రావడం వెనుక కాస్త గ్లామర్ షో కూడా ఉంటుంది. కానీ సుడిగాలి సుధీర్ విషయం అలా కాదు.

  కేవలం టాలెంట్‌తో ఆయన సినీ నటుడిగా ఎదిగాడు. సుడిగాలి సుధీర్ విజయవాడకు చెందినవాడు. అతడిని స్టాండ్ అప్ క‌మెడియ‌న్‌గా చెప్పవచ్చు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వంటి వాటిలో ఈయనకు గుర్తింపు వచ్చింది. ‘ఢీ’ అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 9, 10, 11, 12 లలో ఈయన జట్టు నాయకుడు.

  నేటి యువతరాన్ని ప్రతిబింబించే ‘పోవే పోరా’ అనే అతి ధ్యేయంతో యువతకి నిదర్శనంగా ఎదిగాడు. వాస్తవానికి ఇతను మొదట్లో మ్యాజిక్ చేసుకునేవాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో మాంత్రికునిగా పనిచేశాడు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్కిట్స్ అద్భుతంగా పేలాయి.

  టెలివిజ‌న్లో మంచి రేటింగులు, యూట్యూబ్‌లో మంచి ఆదరణ సాధించాయి. దానితో సహాయక నటుడిగా సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. సుమ కనకాలతో కలిసి 2018 అమెరికన్ తెలుగు కన్వెన్షన్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. టీవీలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్లో 13వ స్థానం సాధించాడు.

   

  రష్మి గౌతమ్‌తో ఇతనికి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చిన ఈయన నేనో రకం, సాఫ్ట్‌వేర్ సుధీర్‌, త్రీ మంకీస్, కాలింగ్ సహస్ర, కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడు, గాలోడు చిత్రాల్లో నటించాడు.

  ఇక చాలామంది కమెడియన్స్ కెరీర్ పీక్స్‌లో వెళ్తున్న సమయంలో పలు సినిమాలలో హీరోలుగా చేసి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. కానీ రీసెంట్‌గా సుడిగాలి సుధీర్ మాత్రం ‘గాలోడు’ చిత్రంతో బంపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. టాక్ సరిగా లేకపోయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను సాధించడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

  ఏమాత్రం బాగాలేని.. టాక్ సరిగాలేని ఈ చిత్రమే ఇంతలా ఆడితే సరైన కథతో, కథనంతో మంచి సబ్జెక్టుతో ఎవరైనా సుడిగాలి సుధీర్‌తో చిత్రం తీస్తే.. ఈజీగా 20 కోట్ల మార్కెట్ ఉంటుందని, 20కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి పలువురు దర్శక నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు.

  తాజాగా.. ‘సోలో’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు ప‌రశురామ్ పెట్ల.. సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన ఈయన.. నిజంగా సుధీర్‌తో చిత్రం తీస్తే అది కచ్చితంగా టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడం ఖాయం. మరి ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular