- పోలీస్‌ల అదుపులో నిదితుడు
విధాత, మెదక్ బ్యూరో: వ్యవసాయమే జీవనాధారంగా, భర్త 20 సంవత్సరాల క్రితమే చనిపోయినా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి పోషించింది. 6 గురి సంతానాన్ని పెద్దచేసి పెళ్లిళ్లు కూడా చేసింది. కానీ చివరకు ఓ తాగుబోతు చేతిలో హత్యకు గురికావడంతో ఆమె జీవితం విషాదాంతం అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా చిన్నశంకరం పెట్ మండలం చందంపేట గ్రామానికి చెందిన వడియారం ఎల్లమ్మ (80) వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయమే జీవనాధారంగా జీవనం కొన సాగిస్తున్నది. భర్త బాలయ్య 20 సంవత్సరాల క్రితం చనిపోయినా కుటుంబ భారాన్ని మోసి తన 6 గురి సంతానాన్ని పెంచి పెద్ద చేసి పెండ్లిల్లు చేసింది. అప్పు లేకుండా ఉన్నకాడికి అందరికీ పంచి కొడుకుల దగ్గర మనిషికి 3 నెలల వంతున ఉంటూ హాయిగా జీవనం గడుపుతుంది.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చందంపేట గ్రామంలో అటుగా వెళుతున్న ఎల్లమ్మను తాగుబోతు మేకల సిద్దరాములు చూశాడు. ఆమె మెడలో ఉన్న బంగారంపై కన్నేశాడు. ఎల్లమ్మ తో మాటలు కలిపి, మాయమాటలు చెప్పి తన ఇంటి వద్దకే తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కట్టేతో కొట్టి ఎల్లమ్మను దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో జరిగిన తతంగం చూసిన సిద్ధిరాములు భార్య కేకలు వేయడంతో గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఎల్లమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ చంద్ర శేఖర్ రెడ్డి,ఎ స్ ఐ సునష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.