విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల అధికారులు చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో తరలివెళ్లారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో మొత్తం […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల అధికారులు చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు.

పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో తరలివెళ్లారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.

మునుగోడు పరిధిలో 2,41,855మంది ఓటర్లు ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3,366 మంది పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. మునుగోడులో ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి కాగా.. ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్లోనూ వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

మరోవైపు గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమ ఆఖరి ప్రయత్నాలుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా పోలింగ్‌కు ముందు రోజు ఇంటింటికి వెళ్లి మద్యం, డబ్బుల పంపిణీ చేశారు. ఓటుకు 3వేల చొప్పున పంపకాలు జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఓటుకు తులం బంగారం, 40వేలు ఇస్తామన్న ప్రచారం సాగడంతో ఇప్పుడు కేవలం 3వేలు మాత్రమే ఇస్తున్నారని గ్రామాల నాయకులను పలు గ్రామాల ఓటర్లు నిలదీసిన ఘటనలు చోటు చేసుకోవడం విశేషం.

Updated On 2 Nov 2022 2:47 PM GMT
krs

krs

Next Story