Tuesday, January 31, 2023
More
  Homelatestనేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్రం ఆమోదం..

  నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్రం ఆమోదం..

  విధాత‌, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. భేటీలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

  ఈ నిర్ణయంతో భారత్‌ గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మారుతుందన్నారు. ప్రతి సంవత్సరం 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానున్నదన్నారు.

  ప్రణాళిక ప్రకారం.. 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందన్న ఆయన.. కొనుగోలుదారులు, అమ్మకందారులు ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు గ్రీన్ హైడ్రోజన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో ఎలక్ట్రోలైజర్ తయారీకి సంబంధించి ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

  60-100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని సిద్ధం చేయనున్నట్లు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై రూ.17,490 కోట్ల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

  గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్ల కేటాయింపునకు, రూ.19,744కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ మిషన్ ద్వారా రూ.8లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, దీంతో 6 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే గ్రీన్ హౌస్ ఉద్గారాలు 50 మిలియన్ టన్నుల మేర తగ్గుతాయని చెప్పారు. దీంతో పాటు

  హిమాచల్‌ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రూ.2,614 కోట్లు ఖర్చు కానున్నది. సట్లెజ్ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular