Telangana ప్రధాన పార్టీల పోటా పోటీ కార్యక్రమాలు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ పరేండ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విమోచన దినం సమైక్యతా దినం నిర్వహించనున్న బీఆరెస్ పాలమూరులో కృష్ణాజలాలతో అభిషేకాలు సాయుధ పోరాట ఉత్సవాలుగా కామ్రేడ్లు విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆ రోజున హైదరాబాద్ కేంద్రంగా బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన అనాలా […]

Telangana
- ప్రధాన పార్టీల పోటా పోటీ కార్యక్రమాలు
- తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ
- పరేండ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విమోచన దినం
- సమైక్యతా దినం నిర్వహించనున్న బీఆరెస్
- పాలమూరులో కృష్ణాజలాలతో అభిషేకాలు
- సాయుధ పోరాట ఉత్సవాలుగా కామ్రేడ్లు
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆ రోజున హైదరాబాద్ కేంద్రంగా బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన అనాలా లేక, విలీనమనాలా? విద్రోహం అనాలా? అన్న అంశంలో విభేదాలున్నప్పటికీ అన్ని పార్టీలూ దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి ఎంత రాజకీయ ప్రయోజనం వస్తుందో కానీ అన్ని పార్టీలు సెప్టెంబర్ 17 జపం చేస్తున్నాయి. కమ్యూనిస్టులు సాయుధ పోరాట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.
విమోచన ఊసెత్తని బీఆరెస్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సయమంలో ప్రకటించిన బీఆరెస్ అధినేత కేసీఆర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి ఊసెత్తలేదు. బీజేపీ కూడా కొంత కాలం కామ్‌గానే ఉన్నది. మధ్యలో బీఆరెస్‌తో విభేదాలు వచ్చిన తరువాత దీనిపై బీజేపీ సీరియస్ అయింది. విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని పట్టు బట్టింది.
రాష్ట్రం విమోచన దినోత్సవాలు పట్టించుకోవడం లేదని, కేంద్రమే అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గత ఏడాది ఢిల్లీలో అధికారికంగా నిర్వహించింది. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బీఆరెస్ కేవలం మజ్లిస్ పార్టీని సంతృప్తి పరచడం కోసమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు.
మజ్లిస్‌తో దోస్తీకే!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మజ్లిస్ పార్టీతో బీఆరెస్ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నది. ఈ సంబంధాలు ఇంకా బలపడ్డాయి. దీంతో సెప్టెంబర్ 17ను విమోచన దినం గానో, విలీన దినంగానో ప్రకటించి నిర్వహించడానికి అధికార బీఆరెస్ ఇబ్బంది పడుతున్నది.
అయితే సెప్టెంబర్ 17ను విమోచన దినంగా కాకుండా జాతీయ సమైక్యత దినంగా నిర్వహించడానికి సిద్ధమైంది. అదే సమయంలో ముందు రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎత్తిపోసిన నీళ్లను కలశాల్లో నింపుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో అభిషేకాలు చేయించాలని పిలుపునిచ్చారు.
నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్సవాలు
1948 సెప్టెంబర్ 17న నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో కలిపింది. ఈ మేరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నన్ని రోజులు అధికారికంగా సెప్టెంబర్17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. కానీ హైదరాబాద్ రాష్ట్రాన్ని చీల్చి ఆంధ్రాను తీసుకువచ్చి తెలంగాణతో కలిపారో అప్పటి నుంచి సెప్టెంబర్17ను విస్మరించారు. కానీ కన్నడ, మరాఠా ప్రాంతాల్లో ప్రతి ఏటా అధికారికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
ఇదే తీరుగా రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీ విమోచన దినోత్సవం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించి 5 హామీలను సోనియా గాంధీ చేత ప్రకటింప జేయడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 17 సందర్భం కలిసివచ్చేలా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది. ఈ సమావేశంలో సోనియా చేతనే తెలంగాణ ప్రజలకు పలు హామీలు ఇప్పించనున్నారు. ఇలా కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలు హైదరాబాద్‌లో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి.
