విధాత: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు, పార్టీ పరిస్థితిపైన, రేవంత్ నాయకత్వ తీరుపైన కోమటిరెడ్డి తన అభిప్రాయాలను వివరించారు.
భేటీలో వెంకట్ రెడ్డి వాదన విన్న ఠాక్రే అయనను సముదాయించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి వెంకట్‌రెడ్డి అవసరం పార్టీకి ఉందని, గతంలో అంశాలను పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరినట్టు తెలిసింది. పార్టీలో గౌరవం గుర్తింపు విషయాన్ని తను చూసుకుంటానని వెంకట్‌రెడ్డికి ఠాక్రే హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
భేటీ అనంతరం వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ కమిటీలను ప్రక్షాళన చేయాలని, పని చేసే వారికి, సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తాను ఠాక్రేను కోరినట్లు తెలిపారు. తనను పట్టించుకోని వారితో, ఐదారు సార్లు ఓడిపోయిన వారితో కలిసి పీసీసీ కమిటీల్లో కూర్చొని తాను పని చేయలేనన్నారు. ఆ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.
తన నియోజకవర్గం పరిధిలోని బీబీనగర్‌కు చెందిన ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి అంత్యక్రియల నేపథ్యంలో నిన్న గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి వెళ్లలేక పోయానన్నారు. ఈ సమావేశానికి సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి కూడా రాలేదని వారిని ఎందుకు అడగరంటూ మీడియాను ప్రశ్నించారు.
గతంలో పార్టీ హైకమాండ్ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్ట పాలయ్యాయని, షోకాజ్ నోటీసుల అంశం మర్చిపోయి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని స్వయంగా మల్లికార్జున ఖర్గే ఇప్పటికే చెప్పారన్నారు. ఠాక్రేతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తన గురించి అతనికి బాగా తెలుసు అన్నారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి తాను ఆయనకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.
Venkanna Files . pic.twitter.com/czakrG7jPH
— Sree Reddy (TG) (@sreereddi77) January 12, 2023