విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అందాల పోటీలు అంటే మనకు గుర్తొచ్చేది స్త్రీలు అక్కడక్కడ పురుష పుంగవులకు కూడా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. దీనికి భిన్నంగా పశువుల కూడా అందాల పోటీలు ఉంటాయని శాంతి సేన రైతు సంఘం నిరూపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పశువులకు అందాల పోటీలు నిర్వహించి అందరిని అబ్బురపరిచారు.
నర్సంపేట పట్టణం “శాంతి సేన రైతు సంఘం” ఆధ్వర్యంలో శనివారం పశువుల అందాల పోటీలను నర్సంపేటలోని బాలుర హై స్కూల్ నందు నిర్వహించారు. ఈ అందాల పోటీలో అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, వాటిని పోషించేటువంటి రైతులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో పాడి పంటలను పశుసంపదను పెంపొందించడానికి కృషిచేస్తానన్నారు. గోదావరి నదీజలాల ద్వారా పాఖాల, రంగాయ చెరువు మాదన్నపేట చెరువు నింపినం.. దీనితో నియోజకవర్గంలో పంట దిగుబడి పెరిగిందన్నారు.
రైతు సంఘాలతో FP లను ఏర్పాటుచేసి విత్తన ఉత్పత్తి యంత్రాలను ఏర్పాటు చేశాం. పంట కొనుగొలు చేపట్టడం, ధాన్యం నిల్వల కోసం లక్ష టన్నుల గొదాoలను నిర్మించాం. రైతులకోసం సబ్సిడీ కరెంటు మోటార్లు, ట్రాక్టర్లు మంజూరు చేశాం. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ ఎంపీపీ, మాజీ చైర్మన్, ఎంపీపీలు, ఏసీపి సర్పంచ్లు సంఘ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.