Mallikarjun Kharge | BalasoreTrainTragedy రాజ‌కీయ వైఫ‌ల్యాల‌కు ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌రిష్కారాలు చూప‌లేవు 2016 నాటి 150 మంది చ‌నిపోయిన కాన్పూర్ రైలు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కు నిందితుల‌ను ఎన్ఐఏ ఎందుకు గుర్తించ‌లేక‌పోయింది? రైల్వేలో ఖాళీగా ఉన్న 3 ల‌క్ష‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం లేదు ఎందుకు? ప్ర‌ధాని మోదీని నిల‌దీసిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖర్గే.. నాలుగు పేజీల లేఖ‌ విధాత‌: సీబీఐ ద‌ర్యాప్తు జ‌రుపాల్సింది నేరాల‌పై మాత్ర‌మేన‌ని, రైలు ప్ర‌మాదాల‌పై కాద‌ని మోదీ స‌ర్కారుకు కాంగ్రెస్ […]

Mallikarjun Kharge | BalasoreTrainTragedy

  • రాజ‌కీయ వైఫ‌ల్యాల‌కు ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌రిష్కారాలు చూప‌లేవు
  • 2016 నాటి 150 మంది చ‌నిపోయిన కాన్పూర్ రైలు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై
    ఇప్ప‌టివ‌ర‌కు నిందితుల‌ను ఎన్ఐఏ ఎందుకు గుర్తించ‌లేక‌పోయింది?
  • రైల్వేలో ఖాళీగా ఉన్న 3 ల‌క్ష‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం లేదు ఎందుకు?
  • ప్ర‌ధాని మోదీని నిల‌దీసిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖర్గే.. నాలుగు పేజీల లేఖ‌

విధాత‌: సీబీఐ ద‌ర్యాప్తు జ‌రుపాల్సింది నేరాల‌పై మాత్ర‌మేన‌ని, రైలు ప్ర‌మాదాల‌పై కాద‌ని మోదీ స‌ర్కారుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే హిత‌వుప‌లికారు. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు జ‌వాబుదారి కావ‌ని, అవి స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించలేవని సూచించారు.

275 మంది ప్ర‌యాణికులు చ‌నిపోయిన ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌నపై సీబీఐ విచార‌ణ జ‌రపాల‌ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ కోర‌డంపై ఖ‌ర్గే విస్మ‌యం వ్య‌క్తం చేశారు. బీజేపీ స‌ర్కారు ప‌నితీరు ప్ర‌శ్నిస్తూ ఖ‌ర్గే సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాలుగు పేజీల లేఖ రాశారు.

వైఫల్యాలకు సంస్థ‌లు జ‌వాబుదారి కావు

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) ఉన్న‌ది నేరాల‌పై విచార‌ణ జ‌రుప‌డానికి. రైలు ప్ర‌మాదాల‌పై విచార‌ణ జ‌ర‌ప‌డానికి కాదు. సీపీఐస‌హా ఇత‌ర ఏ ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలకు జ‌వాబుదారి కావు. స‌మ‌స్య‌ల‌కు అవి ప‌రిష్కారం చూప‌లేవు.

తాజా రైలు ప్ర‌మాదానికి సాంకేతిక‌, సిగ్న‌లింగ్‌, భ‌ద్ర‌తాప‌ర‌మైన లోపాలు కార‌ణం* అని ఖ‌ర్గే లేఖ‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప్ర‌మాదానికి కార‌ణం క‌నుగొన్నామ‌ని చెప్పిన రైల్వే మంత్రి.. ఇంకా సీబీఐ ద‌ర్యాప్తు కోరడం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

నాటి 150 మంది మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు?

2016లో కాన్పూర్‌లో రైలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌లో 150 మంది ప్ర‌యాణికులు చ‌నిపోయార‌ని, అప్ప‌టి రైల్వేశాఖ మంత్రి ఎన్ఐఏ ద‌ర్యాప్తు కోరార‌ని ఖ‌ర్గే గుర్తుచేశారు. 2017 ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిని వ‌ద‌ల‌బోమ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికార‌ని తెలిపారు.

2018 లో ఎన్ ఐఏ త‌న ద‌ర్యాప్తును పూర్తి చేసి చార్జీషీట్ దాఖ‌లు చేసింద‌ని పేర్కొన్నారు. అయితే, రైలు ప్ర‌మాదంలో చ‌నిపోయిన 150 మంది మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు? అని ఖ‌ర్గే నిల‌దీశారు. ఈ ఘ‌ట‌నలో ఎన్ ఐఏ నిందితుల‌ను ఎందుకు గుర్తించ‌లేక పోయింద‌ని ప్ర‌శ్నించారు.

భార‌త రైల్వేలో 3 ల‌క్ష‌ల ఖాళీలు

భార‌త రైల్వేలో 3 ల‌క్ష‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఖ‌ర్గే గుర్తు చేశారు. వాటిని భ‌ర్తీ చేయ‌కుండా మోదీ స‌ర్కారు చోద్యం చూస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఖాళీ పోస్టులు నింప‌కుండా కేంద్రం ఎందుకు అడ్డుప‌డుతున్నద‌ని ప్ర‌శ్నించారు. మ‌రో వైపు రైల్వే సిబ్బందిని సైతం కుదిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. త‌న లేఖ‌లో 11 ప్ర‌శ్న‌ల‌ను సంధించిన ఖ‌ర్గే వాటిని మోదీ స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు.

Updated On 5 Jun 2023 10:57 AM GMT
krs

krs

Next Story