విధాత: జిల్లాలో సెల్ టవర్లలో రిమోట్ రేడియో యూనిట్స్ బేస్ బ్బాండ్, కేబుల్‌లను దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారిని రిమాండుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. శనివారం ఆమె నిందితులను మీడియా ముందు హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసు స్టేషన్‌లో 20వ తేదీన సెల్ టవర్‌లలో చోరీ విషయమై సదరు సెల్ టవర్ ఇంచార్జ్ ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దిరావత్ తండాకి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా ధీరావత్ నవీన్, ధనావత్ కృష్ణ, ధీరావత్ మోహన్‌లను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరు ఐదేళ్లుగా సెల్ టవర్లలో పనిచేస్తు, సెల్ టవర్‌ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి, సెల్ టవర్‌లో వుండే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్, సామాగ్రి విలువ కూడా అవగాహన వుండి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిందన్నారు.
గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో సెల్ టవర్‌లలోకి ప్రవేశించి బీబీయు(BBU), ఆర్ఆర్‌యు(RRU) మరియు కేబల్ లను చోరీ చేసి హైదరాబాద్‌లో సదరు పరికరాల వ్యాపారం చేసే మహమ్మద్ జహంగీర్, రజినీకాంత్ అనే వ్యాపారులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని ఎస్పీ తెలిపారు.
వీరిపై నల్గొండ జిల్లా మిర్యాలగూడ, త్రిపురారం, వేములపల్లి, మాడ్గులపల్లి, నిడమానూర్, తిరుమలగిరి సాగర్, పెద్దవూర, కోండ మల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లి, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ పరిధిలో కూడా సెల్ టవర్ దొంగతనాలపై కేసులు నమోదు అయినాయన్నారు.
దొంగతనాలు జరిగిన తేదీల ఆధారంగా టెక్నాలజీ సహాయంతో ఆయా సెల్ టవర్ల వద్ద టవర్ డంప్ ఆధారంగా నిందితుల యొక్క కదలికలను పరిశీలిస్తూ సెల్ టవర్ దొంగతనాలు చేసే ధీరవత్ తండాకి చెందిన ఇద్దరు నిందితులను, కొత్త సామ్య తండాకి చెందిన ఒక నిందితుణ్ణి మిర్యాలగుడ రూరల్ పోలీసు పట్టుకోవడం జరిగిందన్నారు.
దర్యాప్తు లో ముగ్గురు నిందింతులు నల్గొండ జిల్లా లో సుమారు 10 మండలాలో గల ఎయిర్టెల్, జీఓ, BSNL సెల్ టవర్లలో సుమారు 11 పైగా బేస్ బాండ్లను, 6 RRUలను, కేబల్ వైర్లను, బ్యాటరీలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు.
నిందితులకు సహకరించిన మహమ్మద్ జహంగీర్, రజనీకాంత్ లు పరారిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు ను ఛేదించిన మిర్యాలగూడ DSP పి. వెంకటగిరి , మిర్యాలగూడ రూరల్ CI సత్యనారాయణ, రూరల్ SI D. నరసింహులు, యస్.ఐ సుదీర్ కుమార్, సిబ్బంది IT core team నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాస్, జి. రాజారం, శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, అక్బర్, గోపి లను అభినందించారు.