Rs.75 Coin |
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ నాణెంను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 35 గ్రాముల బరువు, 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉన్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ మిశ్రమాలతో తయారు చేశారు.
నాణేనికి ఒక వైపు అశోక స్తంభం, లయన్ క్యాపిటల్, దాని కింద సత్యమేవ జయతే అని రాసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. నాణెం ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడివైపున ఇంగ్లిష్‌లో భారత్ అనే పదం రాశారు. ఇక నాణేనికి రూపాయి చిహ్నం, లయన్ క్యాపిటల్ కింద రాసిన అంతర్జాతీయ అంకెల్లో 75 డినామినేషన్ విలువ కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది.
ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 28వ తేదీన ప్రారంభించనున్నారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి.
కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, కమ్యూనిస్టులు సహా 20 ప్రతిపక్ష పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతున్నట్లు టీడీపీ, శిరోమణి అకాలీదళ్, జేడీయూ, శివసేన, వైసీపీ, శివసేన (షిండే వర్గం), అన్నా డీఎంకే వంటి 25 పార్టీలు స్పష్టం చేశాయి.