Covid | కరోనా పాజిటివ్ కేసులు( Corona Positive Cases ) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ( Telangana ) సహా ఆరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం( Union Govt ) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ( Health Dept ) అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం లేఖలు రాశారు. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 8వ తేదీ నాటికి 132 కేసులు నమోదు కాగా, మార్చి 15 వరకు 267కి పాజిటివ్ కేసులు పెరిగినట్లు లేఖలో తెలిపారు. అంటే రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖను ఆదేశించారు. మార్చి 8 నుంచి 15వ తేదీ మధ్యలో దేశ వ్యాప్తంగా 2,082 నుంచి 3,254కి కేసులు పెరిగాయని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను కూడా కేంద్రం హెచ్చరించింది.
టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ విధానాన్ని కచ్చితంగా అనుసరించాలని సూచించారు. ఇన్‌ప్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై దృష్టి సారించి, పర్యవేక్షించాలని పేర్కొన్నారు. వైరస్‌ను ప్రాథమిక స్థాయిలోనే అదుపు చేసేందుకు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు, గుర్తించిన ఆస్పత్రులు, స్థానిక క్లస్టర్లలో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని ఆదేశించారు. అర్హులైన వారందరిని బూస్టర్ డోస్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు..
తెలంగాణలో గురువారం ఒక్కరోజే కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్( Hyderabad )లో 12 కేసులు నమోదు కాగా, సంగారెడ్డి జిల్లాలో రెండు, మిగిలిన 13 కేసులు 13 జిల్లాల్లో నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ నెల 10 నుంచి 16 మధ్యలో హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.