Chakilam Anil Kumar
విధాత: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 22 ఏళ్లుగా పార్టీకి వివిధ బాధ్యతలలో సేవలందించి పార్టీ అభివృద్ధికి ఎంత సేవ చేసినప్పటికి తనకు సీఎం కేసీఆర్(CM KCR) నుంచి తగిన గుర్తింపు దక్కలేదన్న బాధతోనే పార్టీకి రాజీనామా చేసినట్లుగా బిఆర్ఎస్ సీనియర్ నేత అనిల్ కుమార్ (Anil Kumar) ప్రకటించారు. బుధవారం సాయంత్రం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు.
రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా సీఎం కేసీఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్(KTR) లకు పంపిస్తున్నట్లుగా తెలిపారు. 2001 నుంచి 2004 వరకు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా, 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర కార్యదర్శిగా, 2014 వరకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తి చేశానన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో, వివిధ ఎన్నికల్లో పార్టీ విజయాల సాధనలో కీలక భూమిక పోషించానన్నారు.
నల్గొండలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ తొలి వార్షికోత్సవం సభలు మొదలుకుని ఉద్యమ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొఫెసర్ జయశంకర్ కు రాజీనామాలు అందించిన నల్గొండ నాగార్జున కళాశాల సభను, ఎంపీగా కరీంనగర్‌లో కేసీఆర్ గెలుపు పిదప నల్లగొండలో నిర్వహించిన విజయోత్సవ సభ ఏర్పాట్లతో పాటు పల్లెబాట, శిక్షణా తరగతులు వంటి పార్టీ కార్యక్రమాలను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వ్యయ ప్రయాసలతో విజయవంతం చేసి పార్టీ కోసం, రాష్ట్ర సాధన ఉద్యమం కోసం పనిచేశానన్నారు. ఈ క్రమం లో తాను పోగొట్టుకున్న ఆస్తులు విలువ వంద కోట్ల పైమాటే అన్నారు.
2004 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి టికెట్ అడిగితే కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా కేసీఆర్ అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కోసం పని చేయాలని ఆదేశించగా అలాగే చేశామన్నారు. 2009 ఎన్నికల్లో మహా కూటమితో పొత్తులో భాగంగా తనకు టికెట్ నిరాకరించి సీపీఎంకి కేటాయించారని, తన తండ్రి చకిలం శ్రీనివాసరావు పంతులు హయాం నుంచి కమ్యూనిస్టులతో నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో వారి గెలుపునకు పని చేశానన్నారు.
2014 ఎన్నికల్లో ముందుగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి చివరి నిమిషంలో మరొకరికి టికెట్ ఇచ్చారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి చివరకు టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తనను ప్రగతి భవన్ కి పిలిపించుకొని కంచర్లను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వాగ్దానం చేశారన్నారు.
2018 నుండి పలుసార్లు ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగినా కేసీఆర్ తనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని, తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా అవకాశం ఇస్తారని ఆశించినప్పటికీ మరోసారి నిరాశ ఎదురయిందన్నారు.
పార్టీకి 22 ఏళ్లుగా ఎన్నో సేవలు చేసిన తనకు ఏ విధమైన రాజకీయ పదవులు దక్కలేదన్న నిరాశతోనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ అధిష్టానం దృష్టికి తన బాధను, నల్గొండ నియోజకవర్గంలో ఉద్యమకారులకు ఎదురవుతున్న కష్ట నష్టాలను తెలియచేసేందుకు ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన సదస్సు సైతం నిర్వహించానన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడి జైళ్ల పాలై, ఆస్తులు నష్టపోయిన తన వంటి ఉద్యమకారులకు బిఆర్ఎస్ లో ఎలాంటి పదవులు, గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులు దక్కాయన్నారు. తెలంగాణ అమరులు ఈతరహా రాజకీయాలు కోరుకోలేదన్నారు.
ఇతర పార్టీలతో సంప్రదింపులు చేసుకొని తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని, కేసీఆర్ మాట మేరకు ఎమ్మెల్సీ పదవి కోసం వేచి చూసి నిరాశతోనే రాజీనామా చేశానన్నారు. తన కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమా లేక మరో పార్టీలో చేరడమా అన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు.
ఇప్పటికైనా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మంత్రి కేటీఆర్ తన లాంటి వారికి బిఆర్ఎస్ లో జరిగిన అన్యాయం పై సమీక్ష చేసుకోవాలని, లేదంటే పార్టీ అధికారం కోల్పోవడం తథ్యమన్నారు. 22ఏళ్లుగా పార్టీ ప్రస్థానం విత్తనం స్థాయి నుండి మొక్క, చెట్టుగా ఎదిగేదాకా పనిచేసిన తనకు ఈ రోజూ ఆ చెట్టు కింద నిలువ నీడ లేకుండా పోవడం బాధాకరమన్నారు.
ఇక పార్టీలో భవిష్యత్తు లేదన్న బాధతోనే పార్టీకి రాజీనామా చేశానన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కన్నారావు, పల్లె రంజిత్ కుమార్, లింగస్వామి, జాకటి ఆనంద్, వెలుగోటి శ్రీనివాస్, కంచర్ల సోమేశ్ రెడ్డి, నామిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.