Wednesday, March 29, 2023
More
    HomelatestNalgonda: ఎటు పోదాం..‘చకిలం’ మల్లగుల్లాలు! తగ్గేదే లేదు.. పోటీ దారిలోనే ‘పిల్లి’

    Nalgonda: ఎటు పోదాం..‘చకిలం’ మల్లగుల్లాలు! తగ్గేదే లేదు.. పోటీ దారిలోనే ‘పిల్లి’

    విధాత: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్లాలన్న‌ దానిపై నియోజకవర్గంలోని తన అభిమానులు అనుచరుల నుంచి అభిప్రాయ సేకరణలో మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటనలు సాగించారు.

    నల్గొండ మండలం పెద్ద సూరారం, కనగల్ మండలం జి. ఎడవెల్లిలో, తిప్పర్తిలో పర్యటించిన అనిల్ కుమార్ ఆ గ్రామాల్లోని అనుచరులు, అభిమానులతో భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై మంతనాలు చేశారు. ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయాలను తీసుకున్నారు. తన కేడర్ నుంచి ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్లాలన్న సూచనలు అనిల్‌కు అందినట్లుగా సమాచారం.

    ఇంకోవైపు ఇదే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పిల్లి రామరాజు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా పార్టీలోని తన అనుచరులతో కలిసి సొంతంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కినా దక్కకపోయినా ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయంతో రామరాజు నిత్యం ప్రజల్లోకి వెళుతున్నారు.

    కుటుంబ పోషకులను కోల్పోయిన వారి ఇళ్లకు, పలు రకాల కష్టనష్టాలకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబాలను ఓదార్చుతూ తన శక్తి మేరకు ఆర్థిక సహాయాలను చేస్తున్నారు. బాధల్లో ఉన్న వారికి బంధువును తానంటూ పిల్లి చేస్తున్న ఆర్థిక సాయాలు జనంలో ఆయన కార్యక్రమాలను నిత్యం చర్చనీయాంశం చేస్తున్నాయి.

    మంగళ, బుధవారాల్లో రామరాజు ఎడవెల్లి, మర్రిగూడెం, రామచంద్రపురం, జి చెన్నారం, నల్గొండ మున్సిపాలిటీ శ్రీనగర్ కాలనీలలో బాధిత కుటుంబాలకు లక్ష వరకు సాయం అందించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో రజకులకు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు.

    ఈ క్రమంలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ నేత చకిలం, రెబల్ నేత పిల్లి రామరాజులు ఇద్దరు తలోదారిలో వచ్చే ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా సాగిస్తున్న కార్యక్రమాలు నియోజకవర్గ రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular