Shock for BRS party.. Chakilam’s resignation
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్‌కుమార్ బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆశించిన అనిల్ కుమార్ ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా(resignation) ప్రకటించారు.
కేసీఆర్ హామీ ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడంతో…
పార్టీ ఆవిర్భావం నుండి జిల్లాలో, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, పార్టీ విస్తరణలో అనిల్ కుమార్ కీలక భూమిక పోషించారు. 22 ఏళ్లుగా బీఆర్ఎస్‌లో పనిచేసిన అనిల్ కుమార్ ప్రతి ఎన్నికలలో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశించి నిరాశ చెందారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించిన పక్షంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రగతి భవన్(Pragathi Bhavan)కి అనిల్ కుమార్(Anil Kumar)ను పిలిపించుకొని హామీ ఇవ్వడంతో ఆయన ఆ ఎన్నికల్లో కంచర్ల గెలుపు కోసం పనిచేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించకపోవడం, సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్‌లో రాజకీయ భవిష్యత్ లేదని…
ఎమ్మెల్సీ పదవీ సాధనకు ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సదస్సులు, తన తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు పంతులు శత జయంతి సదస్సుల ద్వారా ఎమ్మెల్సీ పదవి సాధన దిశగా అనిల్ కుమార్ అధిష్టానం పై ఒత్తిడి పెంచారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రం మరోసారి కూడా ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో అనిల్ కుమార్ పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడంతో నిరాశకు గురైన అనిల్ కుమార్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేనందున బిఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బిఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనిల్ కుమార్ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనున్నారన్నది నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.