Warangal
- విపక్షాల విమర్శలు అధికార పక్షం ఫైర్
- పొలిటికల్ హీట్ పెంచిన కేటీఆర్ పర్యటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీటేక్కించింది. కేటీఆర్ పర్యటనకు ముందుగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలో మాటల యుద్ధం ప్రారంభించాయి. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు పై ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాల అమలు పై నిలదీశారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వడంతో పాటు విపక్షాల పై కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు విరుచుక పడ్డారు.
విపక్షాల విమర్శలు
ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సాగిన అభివృద్ధిపనులలో జాప్యం లేవనెత్తారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వేసిన శిలాఫలకాలకు దిక్కులేదని మళ్ళీ కొత్త శంకుస్థాపనలకు సిద్ధమయ్యారని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చినహామీ మేరకు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాజీపేట రైల్వే PoH నిర్మాణం కొరకు పూర్తి స్థాయిలో స్థలం ఇవ్వకుండా ఎలా వస్తున్నారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నించారు.
ఓరుగల్లు మహానగరానికి మీరు చేసిన అభివృధి పై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు, అవినీతికి పాల్పడతూ అక్రమార్జన లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి నాటకమాడుతున్నాయని విమర్శించారు.
విపక్షాల పై ఫైర్
విపక్ష పార్టీల విమర్శల ,నేపథ్యంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు.
ముఖ్యంగా బిజెపి అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి మతం, కులం పేరుతో విభేదాలు విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పంటల తెలంగాణ కావాలా? నెత్తురు మంటల తెలంగాణ కావాలా అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
సమైక్య రాష్ట్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కనీస అభివృద్ధి పనులు చేయాలంటే నిధుల కొరత ఎదుర్కొన్నామని వినయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కోట్లాదిరూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. గృహలక్ష్మీ పథకంతో పాటు గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదల ఇళ్ల స్థలాల రెగ్యులరైజ్ చేసి పేదలకు భరోసా కల్పించే ప్రత్నం చేస్తున్నామన్నారు.