చంద్రబోస్ కు అరుదైన అవకాశం ఆనందంలో చల్లగరిగేవాసులు మార్చి 12న అవార్డుల ప్రకటన /గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్లు/ / సెవులు సిల్లు పడేలా కీసుపిట్ట కూసినట్టు/ /ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు/ /నా పాట సూడు/ నాటు నాటు/ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓ పల్లెటూరి పిల్లగాడు. అలవోకగా జానపదాలు, పల్లె పాటలు పాడుతూ తిరిగేవాడు. అందరితో కలిసి భజనలు చేసేవాడు. స్కూల్లో ఏదైనా పాట పాడాలంటే.. టీచర్లు పిలిచేది ఆ పిల్లగాడినే. ఏ […]

  • చంద్రబోస్ కు అరుదైన అవకాశం
  • ఆనందంలో చల్లగరిగేవాసులు
  • మార్చి 12న అవార్డుల ప్రకటన

/గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్లు/
/ సెవులు సిల్లు పడేలా కీసుపిట్ట కూసినట్టు/
/ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు/
/నా పాట సూడు/ నాటు నాటు/

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓ పల్లెటూరి పిల్లగాడు. అలవోకగా జానపదాలు, పల్లె పాటలు పాడుతూ తిరిగేవాడు. అందరితో కలిసి భజనలు చేసేవాడు. స్కూల్లో ఏదైనా పాట పాడాలంటే.. టీచర్లు పిలిచేది ఆ పిల్లగాడినే. ఏ సాహితీ గాలి తగిలిందో.. సాహిత్యంపై మనసు పడింది. అసలే పాటలు పాడే గొంతు.. ఆపై సాహిత్యం కూడా వంటబట్టడంతో శ్రావ్యమైన స్వరాలకు అనుగుణంగా అద్భుతమైన పదాలు కుదిరేవి. వయసు పెరుగుతున్న కొద్దీ సాహిత్యంలో మమేకమై పోయాడు. సినీ గేయ రచయితగా దూసుకుపోయాడు. పద సోయగాలతో అల్లినవి కొన్నయితే.. పదునైన పదాలతో పేల్చినవి మరికొన్ని. ఇంకా అడుగుతారా.. ఆ రచయిత ఎవరని? ఇంకెవరు.. వరంగల్ జిల్లా మారుమూల చల్లగరిగే అనే పల్లెటూర్లో పుట్టి పెరిగి, గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, సినీ గేయ రచయితగా సుస్థిరమైన స్థానం సాధించిన చంద్రబోస్.

OSCAR కు అడుగు దూరంలో

తను ఏ విధంగా పెరిగి పెద్దవుతూ వచ్చాడో అదేవిధంగా తన గాయక వృత్తిని కొనసాగించాడు. చిన్నచిన్న గేయాల రచయితగా తనకంటూ కొత్త స్పేస్ ను విస్తరించుకుంటూ పోయాడు. అదే సమయంలో ప్రఖ్యాత జానపద గాయకుడు శంకర్ బృందంలో చంద్రబోస్ భాగస్వామిగా కొనసాగాడు. 'ఇంతింతై వటుడింతైనట్లు' ఇవ్వాల తెలుగు సినీ గేయ రచయిత లలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకొని ఓరుగల్లు కీర్తి కిరీటాన్ని మరో స్థాయికి పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.

రాష్ట్రస్థాయి అవార్డులో, జాతీయ స్థాయి పురస్కారాలో లక్ష్యంగా తయారైన సినీ పరిశ్రమలో.. ఏకంగా ప్రపంచ స్థాయి అవార్డు అయిన ఆస్కార్ కు అడుగు దూరంలో నిలిచాడు కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్. రౌద్రం రణం రుధిరం.. అనబడే RRR సినిమాలో బోస్ రాసిన పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డండనకర మోగిస్తున్నది. సంగీత అభిమానుల చెవుల్లో కీసు పిట్టలా కూయడమేకాదు.. అనేక వేదికలపై సెమట పట్టేలా వీరంగం చేస్తున్నది.

అదే.. నాటు పాట.. నాటు నాటు పాట. ఈ పాటకు ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు లభించగా తాజాగా ఆస్కార్ నామినేషన్ లోకి చేరడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతున్నది. పుట్టిన గడ్డకు, తెలుగు సినీ పరిశ్రమకు సమున్నత గౌరవాన్ని తీసుకురావడంలో చంద్రబోస్ చేసిన శ్రమ, పట్టుదల ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. గ్రామీణ నేపథ్యం, సాహిత్యం పై మక్కువ, పాట పై ఎనలేని ప్రేమ ఆయనను ఈ స్థితికి తీసుకొచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

తెలుగు సినీ రంగంలో తొలుత ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం వెనుకంజ వేయకుండా పట్టుదలతో ప్రయత్నించిన ఇంజినీరింగ్ సాహిత్య పట్టభద్రుడు మన చంద్రబోస్. గాయకునిగా వెలుగుదామని వచ్చి గేయ రచయితగా తెలుగు సినీ రంగంలో స్థిరపడటమే కాకుండా.. విలక్షణ గీత రచయితగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ కు విశేష ఆదరణ

తెలుగు సినీ పరిశ్రమలు ఉన్నత శ్రేణి దర్శకుడిగా ఇటీవల పేరొందిన రాజమౌళి రూపొందించిన చారిత్రక ఫాంటసీ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు గాను…'నా పాట సూడు' అంటూ ప్రారంభమై 'నాటు నాటు' అంటూ దుమ్ము రేపిన పాట.. తెలుగు సినీ లోకాన్ని, ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైనందున అన్ని భాషల్లో ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఇటీవల ఈ పాటకు ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. లాస్‌ఏంజలీస్ లో జరిగిన 28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌లో కూడా రెండు విభాగాల్లో (ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ పాట) పురస్కారాలు సాధించింది.

చల్లగరిగె వాసుల సంతోషం

ఓరుగల్లు వ్యాప్తంగా చంద్రబోస్ పేరు మరోసారి మారుమోగుతోంది. తమ జిల్లాకు చెందిన బిడ్డ ఈ స్థాయికి ఎదగడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బోసు స్వగ్రామమైన చల్లగరిగె వాసులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. నామినేషన్ లో అవకాశం దక్కించుకున్న నాటు పాటకు అస్కార్ అవార్డ్ కూడా రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు.

మార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ప్రకటన

మార్చి 12న జరిగే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డుల తుది విజేతలను ప్రకటించనున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాట.. ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయింది. ఆస్కార్ అవార్డు వస్తే విజేతలుగా 'నాటు నాటు' గేయానికి సంగీతం సమకూర్చిన ఎం ఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ నిలుస్తారు.

ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు: చంద్ర బోస్

తాను రాసిన నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యే అరుదైన ఘనతకు కారకులైన అందరికీ సినీ గేయ రచయిత చంద్రబోస్ ధన్యవాదాలు తెలియజేశారు. తనను ప్రోత్సహించిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి. సినిమా నిర్మాతలు, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు, తాను ఈ స్థాయికి రావడానికి కృషిచేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా తన గేయాలను ఆదరించి అవకాశం కల్పించిన సినీ ప్రేక్షక లోకానికి, శ్రోతలకు రుణపడి ఉంటానని చంద్ర బోస్ చెప్పారు

Updated On 13 March 2023 4:00 AM GMT
krs

krs

Next Story