విధాత: రోగి కోరిందే డాక్టర్ రాసిచ్చాడు.. చంద్రబాబుకు సైతం అచ్చం ఇలాగే జరిగింది. తనను పోలీసులు ఎంతగా నియంత్రిస్తే ప్రజల నుంచి అంత ఎక్కువగా సానుభూతి, మద్దతు లభిస్తుందని భావిస్తున్న చంద్రబాబును నేడు పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబును నిబంధనల పేరిట పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో – 1/2023ని చూపుతూ.. అడ్డంకులు సృష్టిస్తున్నారని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ జీవో ప్రకారం బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పంలో చంద్రబాబు ఈ రోజు నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ప్రచార రథాన్ని ఎక్కి.. ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే సిద్ధమైన ప్రచార రథం.. నియోజకవర్గంలోని శాంతిపురం మండలానికి తీసుకువెళ్లేందుకు నాయకులు రెడీ అయ్యారు. అయితే.. ఈ వాహనానికి అనుమతి లేదంటూ.. పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు.. వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ సహా.. వాహన తాళాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు..
శాంతిపురం మండలం పెద్దూరు శివకురుబూరు గ్రామాల్లో నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.. ఆయా కార్యక్రమాల కోసం.. ప్రత్యేకంగా రథాన్ని రెడీ చేశారు. అయితే.. దీనిని ఆదిలోనే పోలీసులు అడ్డుకోవడంతో తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.