Chandrayaan 3
విధాత: చంద్రయాన్ 2 విఫలమైన నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. కోట్ల మంది భారతీయుల కలలను మోసుకుంటూ జూలై నెలలో చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుండగా.. సుమారు 50 రోజుల లోపు సూర్యరశ్మి జాడ ఉండని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్ కాలుమోపనున్నాయి.
చంద్రయాన్ 3 మిషన్‌లో ఏమేం ఉంటాయంటే..
చంద్రయాన్ 2లో భాగంగా ల్యాండర్, రోవర్, ఆర్బిటర్‌ను పంపగా.. ల్యాండర్, రోవర్ చంద్రుని ఉపరితలంపై కూలిపోయాయి. ఆర్బిటర్ మాత్రం తన పనిని చక్కగా చేస్తోంది. పొదుపునకు మారు పేరయిన ఇస్రో ఈ సారి ఆర్బిటర్‌ను పంపకుండా ల్యాండర్, రోవర్‌ను మాత్రమే పంపుతోంది.
ఇందులో ల్యాండర్ వద్ద చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతను, ఉష్ణ వాహకతను కొలిచేందుకు, అలాగే చంద్రుని గర్భంలో కంపనాలు, ప్లాస్మా డెన్సిటీలను గణించే వ్యవస్థా అందుబాటులో ఉంటాయి. అలాగే రోవర్ .. అల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్టోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ పరికరాలను కలిగి ఉంటుంది. ఇవి చంద్రుని మట్టి కెమికల్ కాంపోజిషన్‌ను ఇవి విశ్లేషిస్తాయి.
ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ల్యాండర్, రోవర్‌లను కలిపి ఒకే భాగంగా పంపించనున్నారు. ఆ ఏర్పాటును ప్రొపల్షన్ మాడ్యుల్ అని పిలుస్తారు. చంద్రుని ఉపరితలం 100 కి.మీ. ఎత్తు నుంచి దీన్ని జార విడిచేలా శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. ఆ మాడ్యుల్‌తో స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పరికరం చంద్రుని వద్దకు వెళుతుంది. ఇది అక్కడి నుంచి భూ గోళానికి సంబంధించిన వివరాలను ఇస్రోకు పంపుతుంది.