Charles 3
- సెంట్రల్ లండన్‌లో భారీ నిరసనలు
- పెద్ద సంఖ్యలో ఆందోళనకారుల అరెస్ట్
- బ్రిటన్ రాజుగా పట్టాభిషిక్తుడైన చార్లెస్ 3
విధాత: ఒకవైపు చార్లెస్-3(Charles 3) ఇంగ్లండ్ రాజుగా పట్టాభిషిక్తుడైతే.. మరోవైపు రాచరికాన్ని వ్యతిరేకించే పలు సంస్థలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ‘గాడిదల నాయకత్వంలో’ అనే సంస్థ వినూత్న ప్రచారానికి దిగింది. తన నిరసన చాటేందుకు సముద్రపు ఒడ్డును ఎంచుకుని భారీ సైకత చిత్రాన్ని తయారు చేసింది.
దాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఆ సైకత చిత్రం చార్లెస్ కిరీటం ధరించి ఉన్నట్టు రూపొందించారు. చిత్రం అడుగున ‘చార్లెస్ ఆఖరి రాజు?’ అని రాశారు. బ్రిటన్‌లో రాచరికం పాత్ర, దాని ప్రభావంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని ‘గాడిదల నాయకత్వంలో’ సంస్థ అభిప్రాయపడింది.
The moment that King Charles III was crownedhttps://t.co/zkaEKcbtbn pic.twitter.com/A7M3rIbly1
— BBC Breaking News (@BBCBreaking) May 6, 2023
రాచరిక వ్యతిరేకుల అరెస్ట్
రాచరికాన్ని వ్యతిరేకించే అనేక సంస్థలు చార్లెస్(Charles 3) పట్టాభిషేకం రోజున దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. లండన్‌లో ఆందోళన చేస్తున్నవారిని మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ లండన్‌లో భారీ స్థాయిలో ఆందోళనకారులు గుమిగూడారు. ‘నాట్ మై కింగ్’ అని రాసి ఉన్న పసుపు రంగు టీషర్టులు ధరించి, రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారని, కానీ, ఎందుకు నిర్బంధించారో కారణం చెప్పడం లేదని రాచరికాన్ని వ్యతిరేకించే సంస్థల్లో అతి పెద్దదైన ‘రిపబ్లిక్’ పేర్కొన్నది.
పట్టాభిషిక్తుడైన చార్లెస్..
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 శనివారం పట్టాభిషిక్తుడయ్యాడు. న్యాయం, కరుణతో తాను ప్రజలను పాలిస్తానని ప్రమాణం చేశారు. అన్ని మతాల, అన్ని నమ్మకాల ప్రజలు స్వేచ్ఛగా వాటిని పాటించేందుకు తగిన వాతావరణం కోసం కృషి చేస్తానని బైబిల్‌పై చేయి వేసి ప్రమాణం చేశారు. అనంతరం బైబిల్‌ను ముద్దు పెట్టుకున్నారు.