విధాత: తనను, తన కుమారుడిని చంపుతానని బెదిరించిన మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ శనివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కు ఫిర్యాదు చేశారు.
పార్టీ ఎంపీ గా ఉండి కూడా సొంత పార్టీ నేతనైన నన్ను చంపుతానని బెదిరించిన వెంకట్ రెడ్డి ప్రజాస్వామిక, రాజ్యాంగ పరిధులు అన్ని దాటారని, పార్టీ పరంగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఠాక్రే ను కోరారు.
కాగా ఇప్పటికే వెంకటరెడ్డి పై చెరుకు సుధాకర్ ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్ లు నల్గొండ పోలీస్ స్టేషన్లోనూ, మానవ హక్కుల కమిషన్ లోనూ ఫిర్యాదు చేశారు. ప్రతిగా వెంకటరెడ్డి తనను చంపుతామంటూ కొంతమంది బెదిరిస్తూ వీడియో పోస్టులు పెడుతున్నారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దానిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పరస్పరం వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్ ల పోటాపోటీ ఫిర్యాదులు, కేసుల పరంపరలో కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది.