విధాత: పీసీసీ ఉపాధ్యక్షుడు తెలంగాణ (Telangana) ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar)ను ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్ (Suhas)ను ఫోన్‌లో దుర్భాషలాడి, చంపుతానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు సుహాస్‌తో పాటు మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, జిల్లా ఎస్పీ అపూర్వ రావు (SP Apoorva Rao)కు ఫిర్యాదు చేశారు.
సోమవారం డాక్టర్ చెరుకు సుహాస్, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ (Duduku Lakshmi Narayana)తో కలిసి జిల్లా ఎస్పీకి వెంకట్ రెడ్డిపై పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సుహాస్, తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. నిన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదని, వెంకట్‌రెడ్డిని అరెస్టు చేయలేదని, అందుకే జిల్లా ఎస్పీని కలిసి విన్నవించామన్నారు. తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి చెరుకు సుధాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వనితనం వెంకట్ రెడ్డిది అన్నారు. చెరుకు సుధాకర్‌కు పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిట్టకనే ఈ బెదిరింపులకు తెర లేపారన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి నీతి నిజాయితీ విలువలు లేకుండా అహంభావంతో అహంకార పూరితంగా ఒక ఉద్యమకారునిపై మాట్లాడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా స్పందించాలన్నారు. వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి చెరుకు సుధాకర్ నన్ను తిట్టాడని ఊరికే పదేపదే అనడం కంటే ఏమన్నాడో మీడియా ముందు రుజువు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ తండు సైదులు, తెలంగాణ గౌడ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డే బోయిన సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, శ్రీ గౌడ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ యూసూఫ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.